Breaking News

స్థానిక సంస్థల్లో 18 వేల పదవులకు బీసీలను దూరం చేసింది వైసీపీ ప్రభుత్వమే : పోతిన వెంకట మహేశ్

-ఇప్పుడు 50 పదవులు ఇచ్చి బీసీలకు పీట వేశాం అనడం దుర్మార్గం
-వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం
-పేద విద్యార్థులను విదేశీ విద్యకు దూరం చేశారు
– పేద యువతులకు పెళ్లి కానుక ఇవ్వకుండా బాధపెడుతున్నారు
-జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేశ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి సుమారు 18వేల మంది పదవులకు బలహీన వర్గాలను దూరం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం… 50 నుంచి వంద నామినేటెడ్ పదవులు ముష్టి వేస్తే బీసీల ఆత్మగౌరవం నిలబడుతుందా అని జనసేన పార్టీ అదికార ప్రతినిధి, పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. బీసీలను సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాకుండా అడ్డుకున్న జగన్ రెడ్డి గారు ముమ్మాటికీ బీసీ ద్రోహే అన్నారు. రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను తగ్గించి పనికిరానీ, ఉత్సవ విగ్రహాల్లాంటి చైర్మన్ పదవులు ఇచ్చి బీసీలకు మేలు చేస్తున్నామని ప్రకటించుకోవడం దుర్మార్గమైన చర్యని అన్నారు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీ సోదరులు గ్రహించాలని, ప్రభుత్వం చేస్తున్న మోసాలు, మాయలను గుర్తించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, కాపులకు పదవుల విషయంలోనే కాదు సంక్షేమం విషయంలోనూ అన్యాయం జరుగుతోందన్నారు. ఆదివారం విజయవాడలో  పోతిన వెంకట మహేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “వైసీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను వాడుకోవాలని కుట్ర జరుగుతోంది. వారితో పల్లకీ మోయించడానికే 50 శాతానికి పైగా నామినేటెడ్ పదవులు ఇచ్చాం అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. నిజానికి ముఖ్యమైన పోస్టులను ఒకే సామాజికవర్గంతో నింపేసి.. ఎక్కడా ఉనికిలో లేని, చెల్లుబాటుకాని పోస్టులు మాత్రం బడుగు, బలహీనవర్గాలకు కేటాయించారు.

విదేశీ విద్యను దూరం చేయడం ఓ కుట్ర…
వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలకు చెందిన విద్యార్ధులు విదేశాలకు వెళ్లి చదువుకోకూడదనే కుట్రతోనే విదేశీ విద్య పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయడం వాస్తవం కాదా? అలాగే ఈ వర్గాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్లి సమయంలో ఆర్థికంగా అండగా ఉండాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పెళ్లి కానుక పథకాన్ని రద్దు చేయలేదా? పెళ్ళికి ఆర్థిక అండ లేకుండా చేసి పేద యువతులను బాధపెడుతున్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువత, మహిళలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేసే సబ్సిడీ రుణాలను కూడా జగన్ రెడ్డి  ప్రభుత్వం రద్దు చేయడం వాస్తవం కాదా? వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చేయూత ఇచ్చే ఇన్ని పథకాలను రద్దు చేసి పనికిమాలిన చైర్మన్ పదవులు కట్టబెట్టి మీ పల్లకీలు మోసే కూలీలుగా మారుస్తున్న విషయం అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారు.

ఒకే సామాజిక వర్గానికి వెయ్యికి పైగా పదవులు…
వెనకబడిన వర్గాలకు 50 శాతం పదవులు ఇచ్చామని డప్పు కొట్టుకుంటున్న ప్రభుత్వం… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇలా అన్ని వర్గాలకు కలిపి… వారి కుల కార్పొరేషన్లు కూడా కలిపి చూస్తే 750 పదవులు ఇస్తే.. ఒక ప్రముఖ సామాజిక వర్గానికి మాత్రం వెయ్యికి పైగా పదవులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? కల్చరల్ అకాడమిని నాలుగు ముక్కలు చేసి నలుగురు చైర్మన్లను నియమిస్తే బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసినట్లు అవుతుందా? రాజమండ్రి స్మార్ట్ సిటీగానే ఎంపిక కాలేదు. కేంద్ర ప్రభుత్వం రాజమండ్రిని స్మార్ట్ సిటీగా తీసుకోలేదు. అలాంటి దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి బీసీని చైర్మన్ గా నియమించారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మాత్రం ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందినవారిని నియమించారు. లేని పదవులు బీసీలకు ఇచ్చి, అజమాయిషీ చెలాయించే పదవులు మాత్రం సొంత సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి  కట్టబెట్టారు ఇదెక్కడి న్యాయం.

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక పదవులేమిటి?
గ్రంథాలయ కార్పొరేషన్ కు నియామకాలు చేపట్టవద్దని కోర్టు చెప్పినా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లు నియమించారు. ఆర్టీసీలో రకరకాల రీజియన్లు పెట్టి పదవుల పందేరం చేపట్టారు. మరో వైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం అని ముఖ్యమంత్రి చెబుతారు. ఇప్పుడేమో ఆర్టీసీలో పదవులు అంటారు. అసలు ఆర్టీసీ విలీనం జరిగిందో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం తరపున మాట్లాడాలన్నా, ప్రభుత్వ పథకాలు ప్రకటించాలన్నా ముఖ్యమంత్రి తాలూకు  సజ్జల రామకృష్టారెడ్డే సోలో పెర్ఫార్మెన్స్ చేస్తారు. శంకుస్థాపనలు, శిలఫలకాలు ఇలా అన్ని కార్యక్రమాలు ఆయన చేతుల మీదగానే జరుగుతాయి. అప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు మచ్చుకైనా గుర్తుకురారు. వాళ్లు కార్యక్రమంలో పాల్గొన్నా పక్కకు నెట్టేస్తారు. దీనిపై వైసీపీలో ఉన్న వెనకబడిన వర్గాలకు చెందిన నేతలు ప్రశ్నించాలి. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, ఆత్మగౌరవం ఒక్క జనసేన పార్టీ,  పవన్ కళ్యాణ్  వల్లే సాధ్యమవుతుంది. ఇప్పటి నుంచైనా జగన్ రెడ్డి  వెనుకబడిన వర్గాల ప్రజలను మోసం చేసే ప్రక్రియను మానుకోవాలి. మానుకోకపోతే అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తిరగబడే రోజు అతి దగ్గరల్లోనే ఉందన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *