విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది.21.12.2024 తేదీ నుండి ప్రారంభమయ్యే భవాని దీక్షల విరమణ కార్యక్రమం ది.25.12.2024 తేదీన జరుగు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి ఇరుముళ్లను (దీక్షా విరమణ) సమర్పించుకోవడానికి విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. దేవస్థాన అధికారులు మరియు ఇతర పోలీస్ అధికారులతో కలిసి భవాని దీక్ష విరమణ సందర్భంగా హోమగుండాలు ఏర్పాటు చేయు ప్రదేశాన్ని, విరుముడుల స్టాండ్ లను ఏర్పాటు చేయు ప్రదేశాన్ని పరిశీలించారు. భవాని భక్తుల ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రదేశాలను, , ప్రసాదం కౌంటర్ల ప్రదేశాలు మరియు గిరి ప్రదక్షణ ఏరియాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గిరిప్రదక్షణ సమయంలో రోడ్లపై ఉన్న ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేసారు.
గిరిప్రదక్షణ, టెంపుల్ పరిసర ప్రాంతలను పరిశీలించి అమ్మవారి దర్శనానికి వచ్చే భవాని భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేవిధంగా మరియు గిరి ప్రదక్షణ సమయంలో భవాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు మరియు సలహాలను అందించడం జరిగింది. అదేవిధంగా క్యూలైన్లను, దర్శనం అనంతరం భక్తులు వెళ్లు మార్గాలను పరిశీలించి, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.తో పాటు, డి.సి.పి. గౌతమి షాలి ఐ.పి.ఎస్., ఎ.డి.సి.పి.లు జి.రామకృష్ణ, ఏ.వి.యల్.ప్రసన్న కుమారు, ఏ.సి.పి.లు దుర్గారావు, రామచంద్ర రావు, ఇనస్పెక్టర్లు గురు ప్రకాష్, ఉమా మహేశ్వర రావు, కొండలరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News