Breaking News

ఉద్యోగుల సంక్షేమమే నా ప్రథమ ప్రాధాన్యత

-ప్రభుత్వంతో సామరస్య పూర్వక సంబంధాలు…
-పోరాటబాట వదలను…
-అపరిష్కృత సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతా…
-ఏపీ ఎన్జీజీఓ సంఘం ప్రతిష్టను పెంచుతా…
-ఈ పదవి బరువు కాదు బాధ్యత…
-వైభవంగా జరిగిన ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలపర్తి విద్యాసాగర్ పదవీ ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడున్నర దశాబ్దాల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలోకి ప్రవేశించి మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే శ్వాసగా వివిధ పదవులు నిర్వహించి నేడు సంఘంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జీజీఓ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఆదరించిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, ఉద్యోగ బాధ్యతలలో వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలోనూ వారి వెన్నంటే ఉంటానని ఏపీ ఎన్జీజీఓ నూతన కార్యదర్శి ఆలపర్తి విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో మంగళవారం మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో సంఘం నూతన కార్యదర్శిగా అధ్యక్షులు కే శివారెడ్డి వేలాది మంది ఉద్యోగుల జయజయ ధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు ఈ పదవిని నిర్వహించిన చౌదరి పురుషోత్తమ నాయుడు పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో నూతన కార్యదర్శి ఎన్నిక కో ఆప్షన్ విధానంలో రాష్ట్ర కార్యవర్గం నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యవర్గాలు విద్యాసాగర్ ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానాలు రాష్ట్ర కార్యవర్గానికి పంపించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గం విద్యాసాగర్ ఎన్నికైనట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీజీవో సంఘంలో ఉద్యోగుల ఆదరాభిమానాలతో ఎన్నో పదవులు నిర్వహించానన్నారు. ఇప్పుడు చేపడుతున్న ఈ పదవి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందన్నారు. తాను ఈ పదవిని బ రువుగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా చర్చించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో బాధ్యతలను నిర్వర్తిస్తానన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా రావలసిన అంశాలలో అవసరమైతే ఆందోళన బాట పడతామన్నారు. తనకంటే ముందు ఈ పదవిని నిర్వర్తించిన నాయకుల పనితీరు గుర్తుపెట్టుకుని మరింత బాధ్యతతో ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. దేశంలోని ఉద్యోగ సంఘాలలో ఏపీ ఎన్జీజీఓ సంఘానికి ఉన్న పేరు ప్రతిష్టలను పెంచుతానన్నారు. ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వంతో చర్చించి సానుకూలమైన ఫలితాలను ఉద్యోగులకు అందిస్తానన్నారు. ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలను వేరువేరుగా వర్గీకరించి ఆయా అంశాలలో వేగవంతమైన ఫలితాలను పొందేలా తన పనితీరు ఉంటుందన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, ఏపీ ఎన్జీవో సహాధ్యక్షులు దస్తగిరి రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డివి రమణ, ఖాళీ నిర్వాహక కార్యదర్శి జగదీశ్వరరావు, కోశాధికారి రంగారావు, ఆర్టీసీ ఎన్ఎంయు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ అధ్యక్షురాలు మంజుల, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోరుకొండ సతీష్, ఎక్సైజ్ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులు నరసింహులు, ఏఐటీయూసీ అధ్యక్షులు రవీంద్రనాథ్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులు జానీ బాషా, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు సుబ్బరాయుడు, ఎన్జిజిఓ సంఘం పూర్వ అధ్యక్షులు పూర్ణచంద్రరావు, జి. నారాయణరావు, టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయాజులు, ఐటిఐ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమేష్, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు సాంబశివరావు, రాష్ట్రంలోని 13 జిల్లాల అధ్యక్షులు కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి, ఏలూరు జిల్లా నుంచి శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు రాఘవరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు జి. శ్రీనివాసరావు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఒంగోలు జిల్లా అధ్యక్షులు శరత్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సాయి, విజయనగరం జిల్లా అధ్యక్షులు కిషోర్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రామ మోహన్ తదితరులతోపాటు వివిధ జిల్లాల నాయకులు జేఏసీ నాయకులు తమ తమ కార్యవర్గాలతో సహా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన విద్యాసాగర్ ను విజయవాడ నగర శాఖ కార్యవర్గం మేళ తాళాలతో ప్రమాణ స్వీకార స్థలానికి భారీ ఊరేగింపుతో స్వాగతం పలికారు.

ఆలపర్తి విద్యాసాగర్
ఒక సాధారణ ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగంతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ఎన్జీజీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలపర్తి విద్యాసాగర్ నేడు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టే స్థాయికి చేరారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగిన నేపధ్యం ఇదీ…
గుంటూరు జిల్లా పొన్నూరులో జన్మించిన ఈయన సైన్స్ లో గ్రాడ్యుయేషన్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం 1987లో ఎన్.సి.సి. విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ బాధ్యతల నిర్వహణతో ప్రారంభమైన ఉద్యోగ జీవితం… చిన్నతనం నుంచి వామపక్ష భావజాలం కలిగిన కుటుంబంలో పెరగడం వల్ల సహజంగా ఉన్న నాయకత్వ లక్షణాలతో 1992లో ఎన్జీవో అసోసియేషన్ లో విజయవాడ నగర శాఖ ఈసీ మెంబర్ గా ఏపీ ఎన్జిజీఓలో తొలి పదవిని చేపట్టారు.
తదుపరి జిల్లా ఎన్జీజీఓ శాఖలో రెండు పర్యాయాలు జాయింట్ సెక్రటరీగా, జిల్లా కోశాధికారిగా రెండు పర్యాయాలు పదవీ బాధ్యతలు నిర్వహించారు.
2005లో జిల్లా కార్యదర్శిగా, 2008 నుంచి జిల్లా సంఘ అధ్యక్షుడిగా, జిల్లా జేఏసీ చైర్మన్ గా…జిల్లా అధ్యక్షుడిగా ఆరుసార్లు ఏకగ్రీవంగా ఎన్నిక…
విద్యాసాగర్ ఆధ్వర్యంలోనే విజయవాడలో బహుళ అంతస్తుల అధునాతన ఎన్జీజీఓ హోం నిర్మాణం, లిఫ్టు, సెంట్రల్ ఎయిర్ కండిషన్ లో సమావేశ మందిరాలు, గెస్ట్ హౌస్, అధునాతన సౌకర్యాలు గల భవంతిని నిర్మించడం, ఆ రోజుల్లో సంఘ భవనాల్లో రాష్ట్రంలో అదే ప్రథమం.
ఉద్యమాలకు నెలవైన విజయవాడలో విద్యాసాగర్ పేరు నిబద్ధతగల నాయకుడిగా మార్మోగింది.
సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో సంధానకర్తగా, వ్యూహకర్తగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రసార మాధ్యమాలలో నిర్వహించిన చర్చలలో తన వాగ్దాటితో చర్చలలో పాల్గొన్న ఇతర సంఘాలకు చెందిన నాయకులు సైతం విద్యాసాగర్ కు ఉన్న పరిజ్ఞానాన్ని ప్రశంసించడం కొసమెరుపు.
ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖల మంత్రులతో సైతం మంచి సంబంధాలు కలిగి ఉండటం, విస్తృతమైన నెట్వర్క్ ని కలిగి ఉండటం, ఏ అంశం మీదైనా అనర్గంగా మాట్లాడగలటం, ఉద్యోగుల సర్వీస్ విషయాలు మరియు సంబంధిత విషయాల తో పాటు అన్ని విషయాలలో సానుకూలమైన ఆలోచనలు, మనస్తత్వం కలిగి ఉండటం ఆయన బలాలు..చలో విజయవాడ ఉద్యమంలో స్థల ఎంపిక నుంచి ఏర్పాట్లు, వ్యూహాలు అన్నిటిలోనూ కీలక పాత్ర. ఉద్యమం సఫలీకృతం చేసే బాధ్యతను జేఏసీ చైర్మన్ లందరూ విద్యాసాగర్ కి మాత్రమే అప్పజెప్పడం అతని నాయకత్వ నిర్వహణకు నిదర్శనం. అది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేయటానికి కారణమైంది..
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలలో నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత కలిగిన నాయకుడుగా గుర్తింపు…మూడు భాషల్లో అనర్గంగా ప్రసంగించగలగటం…
ఏపీ ఎన్జీజీజీఓ సంఘంలో ఏ సమస్య వచ్చినా, చిక్కుముళ్లు ఎదురైనా ట్రబుల్ షూటర్ గా దశాబ్దాలు తరబడి గుర్తింపు పొందారు.
ఉద్యోగుల్లో అతి చిన్న ఉద్యోగి అయినా, కాంట్రాక్టు ఉద్యోగి అయినా, ఔట్సోర్సింగ్ ఉద్యోగి అయినా విస్తృతమైన పరిచయాలు, వారిలో ఒకరిగా మెలగడం…
ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ స్వరోత్సవాలను విజయవాడలో ఐదు రోజులపాటు జయప్రదంగా నిర్వహించటం, 19వ రాష్ట్ర మహాసభలను విజయవాడలో నిర్వహించడం… తలపెట్టిన ప్రతి అంశంలోనూ చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహించి, కార్యక్రమాలను విజయవంతం చేస్తారనే పేరు రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి తెలుసు. పదవి చిన్నదైనా, పెద్దదైనా తన పనితీరుతో ఆ పదవికి వన్నెతెచ్చిన విద్యాసాగర్ వంటి నాయకులు నేటి కాలంలో అరుదుగా కనిపిస్తారని పలువురు వక్తలు ఇదే వేదికపై అభినందించారు. లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం విద్యాసాగర్ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం ఆయన వ్యక్తిత్వానికి ఒక పెద్ద ప్రశంస.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *