బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. సమావేశానికి వచ్చిన మంత్రులకు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఘనంగా ఆహ్వానం పలికారు. సమావేశానంతరం ముగ్గురు మంత్రులు డిఆర్సి సమావేశంపై మీడియాతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి అధికారులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, క్షేత్రస్థాయి సిబ్బంది నిబద్ధతతో పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. అప్పుడే పురోగతి సాధించగలమని అధికారుల్లో స్ఫూర్తినింపారు. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి గుంతలు రహిత రహదారుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ప్రజల సుఖమైన ప్రయాణం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని, ప్రధాన రహదారులపై గుంతలు పూడ్చాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. మరమ్మతు పనులలో గుత్తేదారులు నాణ్యత పాటించకపోతే ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు. గుంతలు పూడ్చే కార్యక్రమంలో జాప్యంపై పలువురు ప్రజా ప్రతినిధులు ఆర్ అండ్ బి అధికారులను ప్రశ్నించారు. దీంతో సి ఆర్ ఎఫ్, ఎండిఆర్ఎఫ్ పెండింగ్ పనులపై ఆయన ఆరా తీశారు. నిధులు ఇస్తున్నప్పటికీ ఎందుకు పనిచేయడం లేదని నిలదీశారు. నేటికీ పనులు ప్రారంభించక పోతే రద్దు చేయాలని, నిబంధనలు విస్మరించిన గుత్తేదారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గుత్తేదారులు సరిగా చేయకపోతే ఇంజినీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారన్నారని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు శ్రద్ధతో పని చేస్తేనే పురోగతి ఉంటుందన్నారు.
అమృతధార పథకం కింద ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే ప్రక్రియ త్వరలో చేపడతామని జిల్లా ఇంచార్జి మంత్రి పార్థసారథి తెలిపారు. లే అవుట్ లలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. గతంలో జల జీవన్ మిషన్ పనులు వేగంగా చేపట్టకపోవడంతో నిధులు మురిగిపోయాయన్నారు. ఆ నిధులను అమృతధార పథకం కింద తెప్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. సాగునీటి కాల్వల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు మేలు జరిగేలా ప్రజా ప్రతినిధుల సహకారంతో ఆయా నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించేలా డి పి ఆర్ సిద్ధం చేయాలన్నారు. కాల్వలలో తూటికాడ తొలగించాలని, మరమ్మతు పనులు వేగంగా చేపట్టాలన్నారు. 92 ఎత్తిపోతల పథకాల కింద 1.07 లక్షల ఎకరాలు పంటలు సాగు అవుతుండగా, 67 పథకాలు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత సమస్యల పరిష్కారం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పి ఎం ఏ వై కింద మంజూరు చేసిన గృహాలు డిసెంబర్ లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి తెలిపారు. కేంద్రం ఇచ్చిన గడువులోగా నిర్మాణాలు చేయలేకపోతే నిధులు మురిగిపోతాయన్నారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో గృహాల నిర్మాణం వేగంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వందరోజుల పని దినాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రూ.110 కోట్లతో బాపట్లలో ఉపాధి పనులు జరుగుతుండగా, రూ.31 కోట్ల పనులు మిగలడంపై అసహనం వ్యక్తం చేశారు. గడువులోగా లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. కూలి దినాలు పెరగడం ద్వారా నిరుపేదలకు జీవనోపాధి దొరుకుతుందన్నారు. టిఏ, ఎఫ్ఏ ఉద్యోగాల భర్తీకి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఇప్పటికే ఆయా లేఅవుట్ లలో నిర్మాణం పూర్తిచేసిన గృహాలను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రారంభించాలని మంత్రి చెప్పారు. లేవట్లలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని బాపట్ల జిల్లాలో సమర్థంగా నిర్వహించడంపై అధికారులను మంత్రి అభినందించారు. ఇసుక తవ్వకాలు, విక్రయాల వద్ద ఎలాంటి సమస్యలు రానివ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సూర్యలంక, చీరాల బీచ్ అభివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని జిల్లా ఇంచార్జి మంత్రి పార్థసారథి చెప్పారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి నివేదించామన్నారు. సర్వీస్ సెక్టార్లు పెరిగితే ఉపాధి అవకాశాలు, ఆదాయం వృద్ధి అవుతోందన్నారు. ఇందుకోసం రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించేలా సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
బాపట్ల జిల్లాలో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మరో ఏడు వేల మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రభుత్వం తాజాగా అనుమతించిందని జిల్లా ఇంచార్జి మంత్రి తెలిపారు. 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. మరో 38 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
విద్యుత్ సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సూర్య ఘర్ పథకం కింద 334 యూనిట్లు ఏర్పాటు చేశామని, మరింత విస్తరింప చేయడానికి బ్యాంకులు సహకరించాలన్నారు. అద్దంకి నియోజక వర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటూమన్నారు. దెబ్బతిన్న పాత స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. పొలాలలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు అరికట్టడానికి, రాగి కొనుగోలు చేసే వ్యక్తులను పట్టుకోవాలన్నారు. సాగు కాల్వల పెండింగ్ బిల్లులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కొరిశపాడు ఎత్తిపోతల పథకం భూసేకరణ పూర్తి చేయాలని, సమీక్షలో చర్చించిన అంశాలపై అధికారులు పనిచేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. ఆలస్యంగా వచ్చే ఖరీఫ్ సీజన్ పంటల దిగుబడి, ముందుగా వచ్చే రబీ దిగబడి అంశాలను డిఆర్సీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ లో మత్స్య సంపద వృద్ధికి నాలుగు లక్షల చేప పిల్లలు వేయాలన్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాలు ఒకేసారి చేపలు పిల్లలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బల్లికురవ మండలంలోని కొనిదన, తదితర నాలుగు గ్రామపంచాయతీలలో ఏడు నెలలుగా పనులు చేయకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. సర్పంచులను సంప్రదించి పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద నిర్మించే తొమ్మిది అడుగుల సిసి రోడ్లతో ఇబ్బందిగా ఉందని, 15 అడుగులకు పెంచి నిర్మించాలన్నారు. బాపట్ల మండలం చింతగుంపల గ్రామంలో 80 స్తంభాలు నూతనంగా వేయాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
సాగునీటి కాల్వల మరమ్మతు పనులు అత్యవసరంగా చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. వెల్లటూరు కాల్వ పనులలో జాప్యం చేయరాదన్నారు. రేపల్లె నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు చేయాలన్నారు. ఇటీవల జరిగిన తనిఖీలలో దస్త్రాలు చూపకుండా పలుమార్లు ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు. ఆక్వా హబ్ ఏర్పాటుకు అధికారులు శరవేగంగా పనులు చేపట్టాలన్నారు. రేపల్లె రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం నాణ్యతలోపించిందన్నారు. టైల్స్ ముక్కలు వేసి గుంతల పూడ్చడం ద్వారా ప్రమాదం జరిగి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా పనిచేస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారన్నారు. బాధ్యతగా పనిచేయండి, విధుల పట్ల శ్రద్ధ చూపాలని హెచ్చరించారు.
బాపట్ల కు వైద్య కళాశాల నిర్మాణానికి మూడో విడతలో నిధులు విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రుణ సదుపాయం కల్పించాలని అధికారులకు సూచించారు. సూర్యఘర్ పథకానికి బ్యాంకుల సహకరించాలన్నారు.
ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి నీరు సరఫరా చేయడానికి రూ.3,500 కోట్లతో డిపిఆర్ పంపామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. అమృత ధార పథకం కింద 2.16 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాలలోని 18 మండలాలకు నీరు అందించేలా రూ.1,820 కోట్లతో నివేదించామన్నారు. నాగార్జునసాగర్ నుంచి ఐదు మండలాలకు నీరు ఇచ్చేలా రూ.450 కోట్లు, గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి రెండు మండలాలకు నీరు ఇవ్వడానికి రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బాపట్ల ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా ప్రతిపాదనలు పంపగా మంజూరు ప్రక్రియలో ఉందన్నారు. ఎన్ ఆర్ సి కేంద్రం మంజూరు అయిందని, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కానుందన్నారు. డి ఆర్ సి లో సమీక్షించిన అంశాలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సాగు కాలువల ఆక్రమణ అరికట్టాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ మంత్రిని కోరారు. డి బి సి రోడ్డుపై పాత బ్రిడ్జిని తొలగించి ఛానల్ వెడల్పు చేయాలన్నారు. కాల్వలపై లస్కర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎత్తిపోతల పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. రహదారుల మరమ్మత్తులు త్వరగా పూర్తిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. గుంతలు పూడ్చే కార్యక్రమంలో నాణ్యత లోపించడంతో ప్రజల అవస్థలు పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. సూర్యలంక బీచ్ నిర్వహణ పంచాయతీకి అప్పగించాలి లేదా పర్యాటక శాఖ బాధ్యత తీసుకోవాలని మంత్రిని కోరారు. అడవి గ్రామంలో అటవీ శాఖ భూమి సేకరించి బోట్ షికార్ అవకాశం కల్పించాలన్నారు. బీచ్ లో సౌకర్యాలు ఏర్పాటు చేసి, అభివృద్ధికి మరింత చొరవ చూపాలన్నారు.
లంక గ్రామాలలో తాడిగిరి పాలెం, పోతుర్లంక ఎత్తిపోతల పథకలు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మంత్రిని కోరారు. వివిధ పనులకు సంబంధించిన బిల్లులు నిలిచాయని, నిధుల విడుదలకు మండల స్థాయి అధికారులు పట్టించు కోవడం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు.
పర్చూరు నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు నిర్వహణ అధ్వానంగా ఉందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు చెప్పారు. 40 వేల ఎకరాలు ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి రైతులు సాగు చేసుకుంటున్నారని, ప్రస్తుతం నష్టాలు చవిచూస్తున్నారని వివరించారు. రైతులను ఆదుకోవాలని అన్నారు. కొత్త లేఅవుట్లలో తాగునీటి సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు. సి ఆర్ ఎఫ్ నిధులతో రోడ్లు నిర్మించలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. రహదారులు సరిగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. మరమ్మత్తులు పనులు సరిగా జరగడం లేదని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
చీరాల నియోజకవర్గం ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉందని, మరమ్మతు పనులు వేగంగా చేపట్టాలని చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య మంత్రి దృష్టికి తెచ్చారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదన పంపి నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవిన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.