అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర హాడ్ హక్ కమిటీ కోఆర్డినేటర్ కే గోవిందరావు తెలిపారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గోవిందరావు మాట్లాడుతూ మార్చి 23వ తేదీన పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మాజీ సైనిక సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లకు గోవిందరావు ధన్యవాదాలు తెలియజేశారు. మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు. 120 సంఘాల మద్దతుతో ఒక రాష్ట్రం ఒకటే అసోసియేషన్ అనే నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ సంఘం రాష్ట్రంలో ఉన్న 1.15 లక్షల మంది మాజీ సైనికులు, సైనిక వితంతువుల సమస్యల కోసం పనిచేసేందుకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి ఎన్నికలు నిర్వహిస్తున్నామని గోవిందరావు అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మంగళగిరి వెట్రన్స్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సాంబశివరావు, జనరల్ సెక్రటరీ పి బాలస్వామి, ట్రెజరర్ కే సాంబశివరావు, షేక్ అమన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News