Breaking News

మావోయిస్టుల ఎన్‌కౌంటర్ పై జ్యుడీషియల్ విచారణకు సిపిఐ డిమాండ్.

-ఆదివాసీయులను చంపి..ఘనతగా మోదీ చెప్పుకోవడం దారుణం.
-ఇళ్ల స్థలాలు, సూపర్‌ 6 హామీల అమలుపై జూన్‌ 2న మండల కేంద్రాల్లో ధర్నాల గోడపత్రిక విడుదల.
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఛత్తీస్‌ఘర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటరులో 27మంది మావోయిస్టులు హతమయ్యారని, ఇవి కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని, వాటిపై న్యాయ విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత నంబాల కేశవరావుతోపాటు 27 మంది చనిపోవడం అంటే..ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని నొక్కిచెప్పారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలని, పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్‌2వ తేదీన..రాష్ట్ర వ్యాప్తండా మండల కార్యాలయాల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.

విజయవాడ దాసరి భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, జి.ఈశ్వరయ్యతో కలిసి రామకృష్ణ గురువారం జూన్ 2న మండల కార్యాలయాల వద్ద సిపిఐ ధర్నాల గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌ పేరుతో సాగించిన మారణకాండంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ తరపున డిమాండ్‌ చేశారు. ఒకవైపు మావోయిస్టులు చర్చలకు సిద్ధమని చెబుతున్న తరుణంలో..వారితో చర్చలకు కేంద్రం ముందుకు రాకుండా, వారి డిమాండ్లపైన, సమస్యలపైన పరిష్కారం చూపకుండా, అదేదో శాంతిభద్రతల సమస్య తరహాగా చిత్రీకరించి ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో నక్సల్స్‌ సమస్య కేవలం శాంతిభద్రతలకే పరిమితం కాదనీ..సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా దాన్ని ప్రభుత్వం పరిగణించాలన్నారు. నక్సల్స్‌కు ఒక మూలం ఉందని, నేడు అమాయక ఆదివాసీయులను పొట్టన పెట్టుకుని, దాన్ని కూడా కేంద్రం ఘనతగా చిత్రీకరించుకోవడం సమంజసం కాదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయని, నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌..నక్సలైట్లను దేశభక్తులుగా వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. మిగిలిన ముఖ్యమంత్రుల కాలంలో ఎన్‌కౌంటర్లు జరిగాయని, వాటిపై ఏ ముఖ్యమంత్రీ.. తమ ఖ్యాతిగా చెప్పుకోలేదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోను నక్సలైట్లతో చర్చలు సాగించారని వివరించారు. ఎన్‌కౌంటరులో 27 మంది ఆదివాశీయుల బిడ్డలందరూ చనిపోతే…ఇవాళ దానిని ఒక ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకోటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా నక్సలైట్లతో చర్చలు జరపాలని, మారణకాండ ఆపాలని సూచించారు. పహల్గామ్‌లో 26 మంది అమాయక పర్యాటకులను హతం చేస్తే, ఆ టెర్రరెస్టులందర్నీ పట్టుకున్నారా? అని సూటిగా ప్రధానిని ప్రశ్నించారు. అక్కడ టెర్రరిస్టులను పట్టుకోవడం కేంద్రానికి చేతకాలేదని, ఇక్కడ మాత్రం నంబాల కేశవరావు తోపాటు 27 మందిని చంపి ఘనతగా చెప్పుకోవడం తగదని, దీన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ఈ ప్రభుత్వం..తన బిడ్డలనే తాను చంపుకుని, ఆ తర్వాత ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని, తక్షణమే ఈ ఎన్‌కౌంటర్లపై జ్యూడిషయల్‌ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారని గుర్తుచేశారు. సీఎంగా చంద్రబాబు పరిపాలన చేపట్టి దాదాపు ఏడాది కావొస్తోందని, ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ పనితీరుపై సమీక్షించుకున్నారని తెలిపారు. నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై పెద్దఎత్తున ప్రచారం చేశారని, అందులో ప్రధానంగా పేదవాళ్లకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ హామీ ఎక్కడా అమలు చేసినట్లుగా తమ దృష్టికి రాలేదన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల సమస్యలపైనా ధర్నాలు చేసినట్లు వివరించారు. అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలతోపాటు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు తక్షణమే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సూపర్‌ 6 హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోందన్నారు. రైతులందరూ ఓట్లు వేసినప్పటికీ..వారికి కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి..ఇవ్వాల్సిన రైతుబంధు రూ.20వేలు ఇవ్వలేదన్నారు. పైపెచ్చూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు కల్లాల్లోనే నానిపోయినా కనీసం వాటికి అవసరమైన టార్పాలిన్‌ పట్టాలను సరఫరా చేపట్టలేదన్నారు.
రైతుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని, ఇటీవల జరిగిన కేబినెట్‌లో మంత్రివర్గంతో కమిటీ వేశామని చెబుతున్నారని, దానివల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అకాల వర్షాలకుగాను వారి పంటలు తడచిపోకుండా టార్పాలిన్‌ పట్టాలను సరఫరా చేయాలని, ఎప్పుడు ఏ పంట వచ్చినప్పటికీ..దాన్ని కొనుగోలు చేసేందుకుగాను ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి సహాయం చేయకుండా, వారి పంటల కొనుగోలుకు సహకరించకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందన్నారు.
విద్యార్థులకు ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, తల్లికి వందనం హామీలనూ అమలు చేయలేకపోయారని, దీంతో పరీక్షల సమయంలో అనేక ఇబ్బందులకు వారు గురయ్యారని తెలిపారు. సూపర్‌ 6 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *