-ఏ తప్పూ చేయకపోతే డిజిటల్ పేమెంట్లు ఎందుకు రద్దు చేసినట్లు?
-మాజీ ముఖ్యమంత్రి చెప్పిన చిన్న గీత-పెద్ద గీత కథనం హాస్యాస్పదం
-జగన్ హయాంలో మద్యం తయారీదారులు ప్రజోపయోగం కోసం డిస్టిలరీలను నష్టాల్లో నడిపారా?
-అసంబద్ధ వాదనలతో తనలోని భయాన్ని బయటపెట్టుకున్న జగన్
-అసలు దొంగ ఎవరంటే…భుజం తడుముకున్న జగన్ వైనం
-పోలీసు అధికారులపై కేసులు పెట్టడం తప్పయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపిన సంగతేంటి?
-ప్రజలు తీర్పిచ్చిన రోజును వెన్నుపోటు దినంగా జగన్ పరిగణించడం సబబా?
-జగన్‌రెడ్డికి మంత్రి సత్యకుమార్ యాదవ్ కౌంటర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారంనాడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు గంటలకు పైగా విలేకరుల సమావేశంలో చేసిన పలు వ్యాఖ్యలపై ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. జగన్‌రెడ్డి అసంబద్ధ వ్యాఖ్యలు, విశ్లేషణలు ఆయన హయాంలో జరిగిన లిక్కర్ కొనుగోలు, విక్రయాలపై ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ పరిణామాల పట్ల ఆయనలో నెలకొన్న తీవ్ర భయాందోళనను స్పష్టం చేశాయని మంత్రి వ్యాఖ్యానించారు.
డిజిటల్ పేమెంట్లు ఎందుకు రద్దు చేశారు?
అప్పటి లిక్కర్ అక్రమాలకు సంబంధించి ఆరోపణలకు గురైన పలువురు జగన్ సన్నిహితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో జగన్‌రెడ్డి తీవ్రంగా కలత చెంది మున్ముందు తన పరిస్థితి ఏమిటో అన్న భయాన్ని మాజీ ముఖ్యమంత్రి నేటి పత్రికా సమావేశంలో చెప్పకనే చెప్పారని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం లిక్కర్ విషయంలో ఎటువంటి తప్పూ చేయలేదని చెప్పడానికి వ్యర్ధ ప్రయత్నం చేసిన జగన్‌రెడ్డి లిక్కర్ విక్రయాలకు సంబంధించి కొనుగోలుదారుల నుంచి డిజిటల్ పేమెంట్లను రద్దు చేసి, మ్యానువల్ పేమెంట్ల ద్వారా అమ్మకాలెందుకు చేశారో అనే ప్రధాన విషయాన్ని మాత్రం వివరించలేదని… దీంతో ఆయన అవలంబించిన దోపిడీ విధానాన్ని అంగీకరించినట్లయ్యిందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విధానం ద్వారా మద్యం ఆదాయం ప్రభుత్వ ఖాతాలోకి రాకుండా వైసిపి పెద్దలు భారీగా దోచుకున్న వాస్తవ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి నేడు నంగనాచిలా మాట్లాడటాన్ని ప్రజలు అంగీకరించరని మంత్రి అన్నారు.
తమ ప్రభుత్వం మద్యపానాన్ని అదుపుచేయడానికి అవలంబించిన విధానాల ద్వారా మద్యం తయారీదారులు ఎట్టి లాభాలు లేకుండా వ్యాపారం చేశారని, అలాంటి పరిస్థితుల్లో వారు లంచాలు ఎలా ఇస్తారని ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగన్‌రెడ్డి వ్యాఖ్యానించడం పూర్తి విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. దీని అర్ధం…ఆ ఐదేళ్లూ మద్యం తయారీదారులు ప్రజల కోసం డిస్టిలరీలను నష్టాల్లో నడిపినట్లా అని జగన్‌రెడ్డిని మంత్రి నిలదీశారు. ఇటువంటి అసంబద్ధ వాదనలతో జగన్ రెడ్డి ప్రజల ముందు చులకనయ్యారని ఆయన ఎత్తి చూపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ అవకతవకల్ని తక్కువ చేసి చూపడానికి తమపై ఒక పెద్ద లేనిపోని కేసును బనాయించారంటూ జగన్‌రెడ్డి చేసిన చిన్నగీత-పెద్ద గీత వాదనను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. జగన్ హయాంలోని లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారు ఇస్తున్న వాంగ్మూలాల విశ్వసనీయతపై జగన్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, అవి ఆయనలో నెలకొన్న భయాల్ని స్పష్టంగా వెల్లడించాయని మంత్రి అన్నారు. తన హయాంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉంటూ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అడ్డగోలుగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, దీర్ఘకాలంపాటు జగన్‌కు సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డి, మరో ప్రధాన నిందితుడు రాజ్కసిరెడ్డిల వాంగ్మూలాల విశ్వసనీయతను ప్రశ్నించిన జగన్‌రెడ్డి, లిక్కర్ స్కాంలో ఇతర ప్రధాన పాత్రధారులైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహనరెడ్డిలు సచ్ఛీలురని కితాబివ్వడం జగన్‌లో నెలకొన్న ఆందోళనకు, ద్వంద ప్రమాణాలకు అద్దంపడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉన్నందున పలువురు ఉన్నత ఐపియస్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయటాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌రెడ్డి…మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 53 రోజుల పాటు జైలుకు పంపడం, మాజీ డిజిపి స్థాయి ఐపియస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావును పలు వేధింపులకు ఎందుకు గురిచేశారని, తనకో న్యాయం ఇతరులకు మరో న్యాయమా అని మంత్రి నిలదీశారు.
ప్రజా తీర్పు వెన్నుపోటా?
2024లో జరిగిన ఎన్నికల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన భారీ తీర్పు జూన్ 4న వెల్లడయ్యిందని,
దాంతో రాష్ట్రంలో ఐదేళ్లపాటు నెలకొన్న చీకటి వీడిందని అట్టి పవిత్రమైన రోజును వచ్చే నెలలో వెన్నుపోటు దినంగా జరుపుకుంటామని మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చేసిన ప్రకటన ఆయన ప్రజాస్వామ్య వ్యతిరేక మానసికతకు మరోసారి అద్దంపట్టిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆక్షేపించారు. ప్రజాతీర్పు వెల్లడైన రోజుకు తదనంతరం ప్రభుత్వం ఏర్పాటైన రోజుకు మధ్య ఉన్న తేడా తెలియని అవివేకి జగన్‌రెడ్డి అని మంత్రి ధ్వజమెత్తారు.ఈ నిర్ణయాన్ని వైసిపి వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ హయాంలో లిక్కర్ బాధితులు
లిక్కర్ కేసు పరిణామాల భయంతో గందరగోళానికి గురైన మాజీ ముఖ్యమంత్రి తమ మద్యం విధానంతో ప్రజల ఆరోగ్యం మెరుగైందంటూ వాస్తవ వ్యతిరేక, హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.స్వంత దోపిడీకోసం నాణ్యతలేని విక్రయం ద్వారా వినియోగదారుల ఆరోగ్యంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దాడి చేశారని మంత్రి ఆరోపించారు. 2018-19లో రాష్ట్రంలో 4,756 లిక్కర్ లివర్ కేసులు డాక్టర్ యన్టీఆర్ వైద్యసేవ కింద నమోదు కాగా, అవి 2023-24లో ఆరోగ్యశ్రీ కింద 11,223కు పెరిగాయని మంత్రి వివరించారు. అదేవిధంగా నరాల వ్యాధుల కేసులు 322 నుంచి 7,646కి పెరిగాయని, మద్యపానం కారణంగా కిడ్నీ రోగులు 12,853 నుంచి 23,553కు పెరిగాయని మంత్రి వెల్లడించారు.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే తమ ప్రభుత్వ మద్యపాన విధానంతో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చానని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిస్సిగ్గుగా చెప్పుకోవడం ఆయనలో నెలకొన్న భయానికి, గందరగోళానికి సాక్షాత్కారమని మంత్రి స్పష్టం చేశారు.
తన అరెష్టు అవకాశాలపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా…అన్నిటికీ దేవుడే ఉన్నాడు అన్న జగన్‌రెడ్డి జవాబు ఆయనలోని నిర్వేదాన్ని వెల్లడించిందని, ఎంతటి పెద్దవారైనా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
అధికారంలోనుంచి దిగిపోతూ రూ.2,500 కోట్ల మేరకు నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలతో పాటు మొత్తం రూ.6,500 కోట్ల చెల్లింపు బకాయిలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ యన్టీఆర్ వైద్యసేవ అమలు, ఇతర పథకాలపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదని మంత్రి స్పష్టం చేశారు
గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం తీరుతెన్నులను వివరించడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానన్న జగన్‌రెడ్డి అందులో సింహభాగాన్ని తాను ఎటువంటి లిక్కర్ స్కామూ చేయలేదని వివరించడానికి చేసిన ప్రయాస ఈ విషయంలో ఆయన గురవుతున్న ఆందోళనను వెల్లడించిందని మంత్రి అన్నారు. విలేకరుల సమావేశంలో…లిక్కర్ స్కాంలో అసలు దొంగ ఎవరు అని జగన్‌ని ప్రశ్నించారని, ఈ ప్రశ్నకు జవాబు కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, గురువారంనాటి జగన్ స్పందన తన భుజాలు తడుముకుంటున్నట్లుగా ఉందని మంత్రి అన్నారు
రాష్ట్ర ఆర్థిక తీరుతెన్నులపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం 3 శాతం మాత్రమే పెరిగిందంటూ జగన్ చేసిన వ్యాఖ్యకు మంత్రి స్పందించారు. ఒక వేళ ఇదే నిజమైతే…గత ఐదేళ్ల వైసిపి పాలనలో జరిగిని ఆర్ధిక విధ్వంసాన్ని అధిగమించి కూటమి ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే ప్రగతికి బాటలు వేసిందని దీని ద్వారా స్పష్టమైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
Prajavartha Online Telugu News