Breaking News

ఇసుక కమిటీ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని నదుల్లో వచ్చే అక్టోబర్ 15వ తేదీ వరకు ఎక్కడ కూడా ఇసుక తవ్వకాలుగాని, అక్రమంగా ఇసుక రవాణా గాని జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నైరుతి రుతుపవనాల కాలంలో నదుల నుంచి ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించిందన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుండి వచ్చే అక్టోబర్ నెల15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని నదుల్లో ఎక్కడ కూడా ఇసుక తవ్వకాలు జరగకుండా ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ ఓ పి) తయారు చేయాలన్నారు. జిల్లాలో అక్రమంగా ఇసుక తవ్వకాలు గాని రవాణా గాని జరగరాదని, ఇందులో ఏమాత్రం రాజీ పడరాదని స్పష్టం చేశారు. అన్ని నదుల వద్ద రాత్రిపూట గట్టిగా నిఘా ఉంచి పోలీసు గస్తీలు సజావుగా జరగాలని ఆదేశించారు.

ఇసుక స్టాక్ యార్డుల వద్ద ఉంచిన సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేయాలన్నారు. అన్ని నదులకు చేరుకునే రహదారి మార్గంలో కందకాలను తవ్వించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు.
ప్రతి నది వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పాయింట్ లాగు పుస్తకము ఉంచి తనిఖీ చేసే పోలీసు, తహసిల్దారు విదిగా సంతకం చేయాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిని జిల్లా కమిటీకి అందజేయాలన్నారు.

రెవిన్యూ డివిజనల్ అధికారి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి తరచు తనిఖీలు చేపట్టాలన్నారు. 24/7 నిరంతరం పనిచేసేలా షిఫ్ట్ డ్యూటీలు షిఫ్టుల పద్ధతిలో సిబ్బందికి విధులు కేటాయించాలన్నారు. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఇసుక అక్రమంగా తవ్వకాలు జరపడం గాని, రవాణా చేయడం గాని చేయరాదని ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.

ఇందుకోసం జిల్లా పంచాయతీ అధికారితో సమన్వయం చేసుకొని గ్రామాల్లో ముందుగా ప్రజలందరికీ తెలిసే విధంగా దండోరా వేయించాలన్నారు. గ్రామసభల తీర్మానాల ప్రతిని సంతకాలతో సహా విధిగా జిల్లా కమిటీకి అందజేయాలన్నారు. ఆ విధంగా నిర్వహించిన గ్రామసభల ఫోటోలను తేదీ సమయము ప్రదేశంతో సహా వివరాలను ఆర్డీవో సంబంధిత ఆర్డిఓ అందజేయాలన్నారు.

జిల్లాలోని 7 స్టాక్ పాయింట్లు శ్రీకాకుళం ,నార్త్ వల్లూరు, రొయ్యూరు, మద్దూరు, చోడవరం, పటమట లంక, రొయ్యూరు సెమీ మేకనైజ్డ్ స్టాక్ యార్డులలో ప్రస్తుతం 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, అందుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఇసుక నిల్వల వివరాలను విధిగా ఒక పలకముపై తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.
ఎవరైనా నిషేధాజ్ఞలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపిన, వాహనాల్లో అక్రమంగా ఇసుకను తరలించిన ఆ వాహనాలను స్వాధీనం చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గుర్తించిన 7 స్టాక్ యార్డులలో నుంచి మాత్రమే ఆఫ్లైన్లో గాని ఆన్లైన్లో కానీ ఇసుకను ఎవరైనా తీసుకోవాలని స్పష్టం చేశారు. రవాణా చేస్తున్న ఇసుక సక్రమమైనదా కాదా అని రసీదులు పక్కాగా తనిఖీ చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పి సత్యనారాయణ, గనుల శాఖ డిడి శ్రీనివాసకుమార్, భూగర్భ జల శాఖ డిడి విజయవర్ధన్ రావు ,వాణిజ్య శాఖ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఈ ఈ రవికిరణ్, గనుల శాఖ ఏజి కొండారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజు ,ఆర్టీవో శ్రీనివాస్ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *