– ఆస్తులపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు
– దసరా, విజయవాడ ఉత్సవ్ కోసం మాత్రమే వినియోగం
– భవిష్యత్తులోనూ ఆలయానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు
– స్వామివారి సమక్షంలోనే ఒప్పందం చేసుకోవడం హర్షణీయమన్న మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి గొల్లపూడిలో ఉన్న ఆస్తులను పరిరక్షించడంతో పాటుగా, ఆలయానికి ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విజయవాడ ఉత్సవ్ కమిటీ ప్రతినిదులు అందించిన రూ.45 లక్షల చెక్కును స్వామి వారి పాదాల వద్ద ఉంచారు. స్వామివారి ఆస్తుల్ని వినియోగించుకుంటున్నందుకు గానూ ఈ మేరకు చెల్లిస్తున్నామంటూ తెలిపారు.
మచిలీపట్నంలోని గొడుగుపేట శ్రీ భూనీలా సమేత వేంకటేవ్వరస్వామి విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న 40 ఎకరాల భూమి అన్యాక్రాంతం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. దశాబ్దాలుగా బూముల ద్వారా ఆదాయం లేకుండా పోయిందన్నారు. దసరా సెలవులను పురస్కరించుకుని వైబ్రేంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాల ఎగ్జిబిషన్ నిర్వహణకు అవసరమైన స్థలాన్ని వారు వినియోగించుకోవడానికి అనుమతి కోరారు. దసరా ఉత్సవాలతో పాటుగా, విజయవాడ ఉత్సవాల నిర్వహణ కోసం 56 రోజులకు రూ.45 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సమయంలో రైతులకు రూ.15 లక్షలు చెల్లించడం హర్షణీయం. ఈ మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకున్నాం. 56 రోజుల అనంతరం భూముల్ని ప్రభుత్వానికి స్వాదీనం చేసేలా ఒప్పందం చేసుకున్నాం. అవసరం మేరకు కోటి వ్యయంతో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం. 7 ఎకరాలకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఆ దేవదేవుడి భూములను పరిరక్షించడం మా తక్షణ కర్తవ్యం. అందుకోసం అవసరమైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, సదరు భూమి ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకుంటాం. 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చామనే వాదన పూర్తిగా అవాస్తవం. భూముల ద్వారా ఆలయానికి ఆదాయం సమకూర్చడం, తద్వారా ఆలయాన్ని మరింతగా అభివృద్ధి బాటలో నడిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. తెలుగువారి సంస్కృతి, కళలను ప్రజలందరికీ అందించే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నాం.
సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా విజయవాడను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నాం. దసరా ఉత్సవాలు అంటే అందరికీ మైసూర్ గుర్తొస్తుంది.. అదే విధంగా విజయవాడలో నిర్వహించాలనుకుంటున్నాం. దేవాలయ స్థలం విషయంలో అపోహలు నెలకొనడం బాధాకరం. ఆలయ కమిటీ సభ్యులందరితో చర్చించిన తర్వాతే ఆలయానికి ఆదాయం కల్పించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆలయ భూముల్ని వినియోగించుకుంటున్నందుకు ఆలయానికి రూ.45 లక్షలు, రైతులకు రూ.15 లక్షలు చెల్లించాం. 54 రోజుల పాటు మాత్రమే వినియోగించుకునేలా ఆలయ కమిటీతో ఒప్పందం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి వారి ఆస్తుల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తాం. ఈ ఆదాయంతో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మరింత అభివృద్ధి చెందాలి. కృష్ణా జిల్లా ప్రజలు, నాయకులు విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేయాలి. బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేసినట్లుగా.. విజయవాడ ఉత్సవ్ నిర్వహిద్దాం. వేసవి సెలవుల్లో బందరులో బీచ్ ఫెస్టివల్.. దసరా సెలవుల్లో విజయవాడ ఫెస్టివల్ నిర్వహిద్దాం. దేవాలయ అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మాటిస్తున్నా. విజయవాడ ఉత్సవ్ విజయవంతానికి ఆ దేవ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం మాట్లాడుతూ.. మచిలీపట్నంలో జరిగిన మసులా బీచ్ ఫెస్టివల్ స్పూర్తితో విజయవాడలో దసరా సందర్భంగా ఉత్సవాల నిర్వహిస్తున్నాం. సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించాం. పున్నమి ఘాట్, గొల్లపూడిలో విజయవాడ ఎక్స్ పో, బందరు రోడ్డులో టూరిజం కార్నివాల్, ప్రకాశం బ్యారేజీపై అంతర్జాతీయ స్థాయి ఫైర్ వర్క్స్ నిర్వహిస్తాం. గొల్లపూడిలోని స్వామివారి భూమిలో అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సూచనలతో గ్లోబల్ విలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచించాం. జిల్లా రెండుగా విడిపోయినా.. ప్రజలంతా ఎప్పటికీ ఒక్కటే అనే భావనతో ఉన్నాం. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆలయ అభివృద్ధికి సహకరించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. దేవాలయ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పట్టాభిరాం పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ బాబాప్రసాద్, గొడుగుపేట వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ వడ్లమూడి లక్ష్మీనరసింహరావు, వైబ్రేంట్ విజయవాడ సంస్థ ప్రతినిధిగా మురళి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News