Breaking News

మొంథాతో న‌ష్టపోయిన రైతాంగానికి స‌త్వ‌ర ప‌రిహారం

-త్వ‌ర‌లోనే తడిచిన పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తాం
-సీఎం చంద్ర‌బాబు అప్ర‌మ‌త్త‌తో త‌ప్పిన పెను ముప్పు
-తుఫానుతో దెబ్బ‌తిన్న విద్యుత్ క‌నెక్ష‌న్లు పూర్తిగా పున‌రుద్ధ‌ర‌ణ
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అద్దంకి / ప‌ర్చూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫానుతో న‌ష్టపోయిన రైతాంగానికి స‌త్వ‌ర ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ప‌ర్చూరు, అద్దంకి నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌హ‌చ‌ర మంత్రి కొలుసు పార్థసార‌థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావుతో క‌లిసి మంత్రి గొట్టిపాటి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అన్నంబ‌ట్లవారి పాలెం, గ‌ర్న‌పూడి, తిమ్మ‌రాజుపాలెం, అగ్ర‌హారం, ప‌ర్చూరు, ప‌ర్చూరు టౌన్ లోని నీట మునిగిన ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి జే.పంగులూరు మండ‌లంలోని బూద‌వాడ‌, కోట‌పాడు, కొండమూరు గ్రామాల్లోని పంట పొలాల‌ను అధికారుల‌తో క‌లిసి తిరిగారు. పొలాల‌కు వెళ్లి తుఫానుతో న‌ష్టపోయిన వ‌రి, వేరుశ‌న‌గ‌, వంగ‌, ప‌త్తితో పాటు ప‌లు ఉద్యానవ‌న‌ పంట‌ల‌ను ప‌రిశీలించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పంటలకు జ‌రిగిన న‌ష్టాన్ని అధ్య‌యనం చేసి యుద్ధ ప్రాతిప‌దిక‌న న‌ష్టం అంచ‌నా నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌కు మంత్రి గొట్టిపాటి ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రియ‌ల్ టైంలో ప‌ర్య‌వేక్షించి అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డంతో పెనుముప్పు తప్పింది అని గొట్టిపాటి పేర్కొన్నారు. వాగులు, వంక‌లు పొంగి పొర్ల‌డంతో పంట‌లు నాశ‌నం అయ్యాయ‌ని, రైతాంగం తీవ్రంగా న‌ష్ట పోయింద‌ని ఆయ‌న‌ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ్రామాలు, పొలాలు గ‌డిచిన నాలుగు రోజులూ తుఫాను వ‌ర‌ద‌తో నిండి పోయాయ‌ని తెలిపారు. అమ్మ‌కాలు చేయ‌డానికి ఇళ్ల‌లో ఉంచిన పొగాకు త‌డిచిపోయిందని చెప్పారు. ముఖ్య‌మంత్రితో పాటు వ్య‌వ‌సాయ మంత్రి దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లి త్వ‌ర‌లోనే తడిచిన పొగాకు కొనుగోళ్ల‌ను ప్రారంభిస్తామ‌ని రైతుల‌కు మంత్రి గొట్టిపాటి భ‌రోసా ఇచ్చారు. బాధిత‌ రైతుల‌తో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి… న‌ష్టప‌రిహారం నివేదికను వెంటనే ప్ర‌భుత్వానికి పంపుతామ‌ని హామీ ఇచ్చారు. అదే విధంగా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా తుఫాను న‌ష్టానికి సంబంధించి ప‌రిహారం రైతుల‌కు అందిస్తామ‌న్నారు. అద్దంకి ప‌ట్ట‌ణంలోని నాలుగ‌వ వార్డులో ప‌ర్య‌టించిన మంత్రి గొట్టిపాటి అక్క‌డి ప్ర‌జ‌లు త‌న దృష్టికి తీసుకొచ్చిన‌ స‌మ‌స్య‌లను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

గ‌తంలో స‌రిగా పూడిక‌లు తీయ‌క‌పోవ‌డంతో వాగులు, వంక‌లు పొంగి పొర్లాయ‌ని మంత్రి గొట్టిపాటి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప‌ల్నాడు, అద్దంకి వంటి ఎగువ ప్రాంతాల నుంచి ప‌ర్చూరు, బాప‌ట్ల వంటి దిగువ ప‌ల్ల‌పు ప్రాంతాల‌కు వ‌ర‌ద నీరు చేరి పంట పొలాల‌ను ముంచెత్తాయ‌ని తెలిపారు. బాప‌ట్ల‌, ప్ర‌కాశం, మ‌చిలీప‌ట్నంతో పాటు ఉత్త‌రాంధ్ర‌లోని ప్రాంతాలు తుఫానుతో పెద్ద ఎత్తున న‌ష్ట పోయాయ‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. అందుకే క్షేత్ర స్థాయిలో అధికారుల‌తో ప‌ర్య‌టించి న‌ష్టం అంచ‌నా నివేదిక రూపొందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. చాలా ప్రాంతాల్లో కూలిపోయిన చెట్ల‌ను తొల‌గించి, విరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త‌వి ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా గృహ అవ‌స‌రాల‌కు పూర్తి స్థాయిలో ఇప్ప‌టికే విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌రించామ‌ని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ‌, ఆక్వా, ఇత‌ర అవ‌స‌రాల‌కు సంబంధించిన క‌నెక్ష‌న్ల‌ను కూడా గురువారం సాయంత్రానికి చాలా వ‌ర‌కు స‌రి చేశామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులతో పాటు నేత‌లు పొల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *