-గడిచిన 6 నెలల్లో 107 నుంచి 312కు పెరిగిన ‘ఎ’ శ్రేణి ఆరోగ్య కేంద్రాలు
-‘బి’ శ్రేణిలో 354 నుంచి 455 కు చేరిన పీహెచ్సీలు
-మొత్తం 306 కేంద్రాల పనితీరు మరింత మెరుగు
-సి,డి,ఇ కేటగిరి కేంద్రాలూ తగ్గుదల
-మొత్తం వైద్య ఆరోగ్య శాఖ స్వీయ సమీక్షతో సత్ఫలితాలు
-మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించిన డీహెచ్ డాక్టర్ పద్మావతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణులకు చేరువులో ఉoడే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ఓపీ, ఐపీ, ల్యాబ్ టెస్టులు, ప్రసవాలు, ఇతర విధానాల అమల్లో పీహెచ్సీలు ముందంజలో ఉంటున్నాయి.
గత మార్చి (2026) నెలలో 1,144కు 312 పీహెచ్సి ఆసుపత్రులు ‘ఎ’ శ్రేణిలో వచ్చాయి. గతేడాది అక్టోబరు (2025) నెలలో 107 పీహెచ్సీలు మాత్రమే ‘ఎ’ శ్రేణిలో ఉన్నాయి. కేవలం ఆరు నెలల్లో మూడు రెట్లు ఎక్కువగా పీహెచ్సీలు (312) ‘ఎ’ శ్రేణికి చేరుకోవడం గమనార్హం. ఇదే కాల వ్యవధిలో బి శ్రేణి ఆసుపత్రులు 354 నుంచి 455(అదనంగా 101)కు చేరుకున్నాయి. సి, డి, ఇ గ్రేడుల ఆసుపత్రులు తగ్గుతూ వచ్చాయి.
హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) లో నమోదుచేసే వివరాల ప్రకారం పీహెచ్సీల పనితీరును శ్రేణుల వారీగా గుర్తించి, సదరు నివేదికను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు అందచేశారు. గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు నెలల వారీగా 1,144 పీహెచ్సీల పనితీరు మదింపు వివరాలను డీహెచ్ తన నివేదికలో పొందుపరిచారు. ‘బి’ గ్రేడ్ కేంద్రాలు కిందటేడాది అక్టోబరులో 354 ఉండగా మార్చి నాటికి 455 చేరుకున్నాయి. సి గ్రేడులో 298, డి గ్రేడులో 72, ‘ఇ’ గ్రేడులో 7 చొప్పున ఆసుపత్రులు ఉన్నాయి:
పనితీరు ప్రతిపాదికన మార్కుల కేటాయింపు।
రాష్ట్ర వ్యాప్తంగా 1,144 పీహెచ్సీలు ఉన్నాయి. ఓపీకి 1, ఐపీ-1, ల్యాబ్ టెస్టు-1, ప్రసవాలు-1, ఇతర ఒకటి చొప్పున కలిపి ఐదు మార్కులు ఇస్తున్నారు. పీహెచ్సీల ద్వారా రోగులకు అందచేసే సేవల వివరాలు హెచ్ఎంఐఎస్ ఎప్పటికప్పుడు నమోదవుతున్నాయి. నెలకు 1,500 ఓపీ, 100 ఐపీ (డే-కేర్), ల్యాబ్ టెస్టులు-3,000, పది చొప్పున ప్రసవాలు జరగాలి. ఇంకొన్ని ఫలితాలను శాస్త్రీయ కోణంలో విశ్లేషించి, పనితీరు ప్రతిపాదికన పీహెచ్సీలకు వైద్య ఆరోగ్య శాఖ ‘శ్రేణులు’ ఇస్తోంది. సమీక్షా సమావేశాల్లో తక్కువ పనితీరు కనబరిచే ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి శ్రీ సత్య కుమార్ సమీక్ష సమావేశాల ద్వారా ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. వీటికి అనుగుణంగా జిల్లాలకు వెళ్లే ఆదేశాలనుసారo అక్కడి అధికారులు పీహెచ్ సీల వైద్యులతో సమీక్షలు జరుపుతూ వైద్య సేవలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల పీహెచ్ సీ ల పనితీరు క్రమంగా మెరుగుపడుతో oది. దీనివల్ల సి, డి, ఇ గ్రేడ్లలో ఉన్న పీహెచ్సీలు తగ్గుతున్నాయి
ఆరుసార్లు ‘ఎ’ శ్రేణిని దక్కించుకున్న పీహెచ్సీలు
అన్నమయ్య జిల్లాలో కురబలకోట పీహెచ్సీ అక్టోబరు నుంచి మార్చి వరకు ప్రతినెలా ‘ఎ’ శ్రేణిలో వచ్చింది. ఈస్టుగోదావరి జిల్లాలో బ్రహ్మణగూడెం, చాగల్లు, నల్లజర్ల పీహెచ్సీలు వరుసగా ఆరుసార్లు ప్రథమ శ్రేణిలో వచ్చాయి. కాకినాడ జి ల్లాలో తేటగుంట పీహెచ్సీ ఆరుసార్లు, ఇలా ప్రతి జిల్లాలో కొన్ని పీహెచ్సీలు ఐదు నుంచి మూడుసార్లు చొప్పున ‘ఎ’ శ్రేణిలో వచ్చాయి.
మార్చి వరకు చూస్తే…
ఈ ఏడాది మార్చి నెల శ్రేణులు పరిశీలిస్తే వెస్టు గోదావరిలో 34కు 33, కృష్ణా జిల్లాలో 49కు 42, వైఎస్సార్ కడప-57కు 42, విజయనగరం జిల్లాలో 48కు 32 పీహెచ్సీలు ప్రథమ శ్రేణిలో వచ్చాయి. పోలవరం జిల్లాలో 28 పీహెచ్సీలకు 2, మార్కాపురం జిల్లాలో 38కు 1, శ్రీకాకుళం జిల్లాలో 66కు ఒకటి, నెల్లూరు జిల్లాలో 52కు ఒకటి, చిత్తూరు జిల్లాలో 42కు ఒక పీహెచ్సీ ‘ఈ’ గ్రేడులో ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా డి శ్రేణి ఆసుపత్రులు
గత మార్చి నెలకు సంబంధించి డి గ్రేడ్ పీహెచ్సీలు రాష్ట్రవ్యాప్తంగా 72 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 10 చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో తొమ్మిది, పోలవరం జిల్లాలో 8, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఏడు చొప్పున, ఏలూరు జిల్లాలో ఆరు చొప్పున డి గ్రేడ్ ఆసుపత్రులు ఉన్నాయి. గత మార్చి నెలలో ‘ఇ’ గ్రేడ్ ఆసుపత్రులు ఏడు ఉంటే.. రెండు పోలవరం జిల్లాలో ఉన్నాయి. నెల్లూరు చిత్తూరు, మార్కాపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క పీహెచ్సీ ఉంది.
Prajavartha Online Telugu News