-పనితీరు బాగున్న వారికి గుర్తింపు-గౌరవం
-అధికారులు, కలెక్టర్లు, ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్
-ఆర్టీజీఎస్ నుంచి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది 40 వేల మందితో నేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి
-గృహ నిర్మాణానికి సంబంధించి సూచనలు చేసిన కాకినాడ జిల్లాకు చెందిన గృహ నిర్మాణ శాఖ ఉద్యోగికి సీఎం కితాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ తెచ్చేలా ఉన్నతస్థాయి అధికారి మొదలుకుని… క్షేత్ర స్థాయి అధికారి వరకు పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. AMCA ప్రాజక్టు శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తర్వాత ఏపీ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్సులో జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో పాల్గొన్నారు. సుమారు 40 వేల మందితో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడంలో టాప్-3లో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాల కలెక్టర్లు నిలిచారు. ఈ టెలి కాన్ఫరెన్సు ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ సేవల అమలు… అర్జీల పరిష్కారంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అందించే సేవల గురించి… మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయి సిబ్బంది సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. గృహ నిర్మాణానికి సంబంధించి ఆ శాఖకు చెందిన కాకినాడ జిల్లాకు చెందిన ఉద్యోగి నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి.. కొన్ని సూచనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ… మంచి సూచనలు చేశారని.. దీన్ని అమలు చేస్తామంటూ సీఎం చెప్పారు. కిందిస్థాయి ఉద్యోగులకు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. అందరి సహకారం వల్లే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతి ఒక్కరి సహకారం వల్లే వ్యవస్థలు గాడిలో పడ్డాయి. 2047 స్వర్ణాంధ్ర సాధనకు లక్ష్యాలు పెట్టుకున్నాం. పది సూత్రాలను అమలు చేస్తున్నాం. 23 నెలల్లో రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. 24 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు వచ్చాయి. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, ఆమ్కా వంటి కీలక ప్రాజెక్టులు వచ్చాయి. త్వరలో బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుకు శంప్రకుస్థాపన చేస్తాం. AMCA ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి-బెంగళూరు మధ్య ఎయిరో స్పేస్ సిటీగా అభివృద్ధి జరుగుతుంది. టీంగా పని చేయాలి. అభివృద్ధి సాధించాలి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. ప్రభుత్వ సేవలపై తీసుకుంటున్న ఫీడ్ బ్యాక్ లెక్కలే దీనికి నిదర్శనం. ప్రభుత్వ సేవల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అగ్ర భాగాన నిలిచింది. ప్రభుత్వ సేవల తో పాటు ప్రజలతో సఖ్యతగా మెలగడం వల్లే పెన్షన్ల పంపిణీ టాప్ లో నిలిచింది. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఏమైనా గ్యాప్ ఉంటే.. జిల్లా యంత్రాంగం అలెర్ట్ కావాలి. జిల్లాల్లో 80 శాతం మంది పనితీరు బాగుంది… అభినందనలు. ప్రతి ఒక్కరి పనితీరును విశ్లేషిస్తున్నాం… బాగా పని చేసిన వారిని గౌరవిస్తాం.. గుర్తిస్తాం.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.
అర్జీల పరిష్కారంపై స్పెషల్ ఫోకస్.
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక-ఆర్థికేత సమస్యలుగా విభజించుకుని పని చేయాలి. ఆర్థికేత సమస్యలను 100 శాతం పరిష్కరించాల్సిందే. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అన్ని చోట్లా రావాలి. అన్ని స్థాయిల్లో ఉండాలి. AMCA ప్రాజెక్టుకు 36 రోజుల్లో అనుమతులిచ్చి… శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం. AMCA ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అవినీతి అనేది కన్పించకూడదు.. పారదర్శకతతో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి. నెల్లూరు కలెక్టర్ చేసిన ప్రయోగాన్ని చూసి ప్రతి నియోజకవర్గంలో నాలుగు సార్లు పర్యటనలు చేసేలా ప్రణాళికలు రూపొందించాం. వినతి పత్రాలు స్వీకరిస్తాం. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. చిన్న చిన్న పనులైనా వెంటనే స్పందించాలి… సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలగాలి. మన పాలనకు బ్రాండుగా మారాలి. తక్కువ ఖర్చుతో ఇంపాక్ట్ చూపించేలా పనితీరు మెరుగుపర్చుకోవాలి. వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి.”అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
డేటా, టెక్నాలజీ ఆధారంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై అలెర్టులు
“ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి. అడ్వాన్స్ డిసిజ్ సర్వైలెన్స్ సిస్టం ద్వారా వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న వ్యాధులను గుర్తించి… అలెర్టులు పంపే విధానం బాగుంది. దీన్ని సంజీవనికి అనుసంధానం చేయాలి. ఏయే ప్రాంతాల్లో ఏయే రకాల పంటలు వేస్తే బాగుంటుందోననే అంశంపై అన్ని అంశాలు పరిశీలించి రైతులకు సూచనలు పంపాలి. ఇసుక లారీలు, వివిధ గనుల తరలించే లారీలను ట్రాక్ చేసేలా చూడాలి. ఏ వాహనామైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు కన్పిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి.”అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News