Breaking News

బీహార్‌ రాష్ట్రం, రాజ్‌గిర్ లోని నలందా విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవం

బీహార్‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా ఈరోజు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న నలందా విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. 14 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 221 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేస్తూ, వారి విద్యా విజయాలు కఠిన శ్రమ, పట్టుదలపై నిర్మితమయ్యాయని కొనియాడారు. చరిత్రలోనే అత్యంత గొప్ప విద్యా కేంద్రాలలో ఒకటిగా ప్రాచీన నలందా మహావిహారను గుర్తిస్తూ..”కేవలం సంస్థలుగా మిగిలిపోయే విశ్వవిద్యాలయాలు కొన్ని ఉంటాయి. కానీ నాగరికతకు చిహ్నాలుగా నిలిచే విశ్వవిద్యాలయాలు మరికొన్ని ఉంటాయి. నలందా రెండో వర్గానికి చెందినది” అని డాక్టర్ మిశ్రా అన్నారు:
ఈ ప్రాంత చారిత్రక, భౌగోళిక ప్రాముఖ్యతను వివరిస్తూ.. జ్ఞానం అనేది ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉండాలని, విభిన్న రంగాలతో ముడిపడి ఉండాలని, మానవాళి శ్రేయస్సు వైపు నడవాలనే నలందా మూలతత్వాన్ని డాక్టర్ మిశ్రా గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విశ్వవిద్యాలయ సరికొత్త ‘నెట్ జీరో’ క్యాంపస్‌ను ప్రసంసిస్తూ.. భగవాన్ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధగయను స్మరించుకున్నారు. “నిజానికి భగవాన్ బుద్ధుని బోధనల వల్ల మొత్తం ఆసియా ఖండం ఎంతో ప్రయోజనం పొందింది. ఈ గొప్ప విశ్వవిద్యాలయం నుంచి నేర్చుకున్న విషయాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను” అని అన్నారు.
ప్రస్తుత ఆధునిక కాలపు సవాళ్లను ప్రస్తావిస్తూ.. 21వ శతాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బయోటెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాలలో మానవాళి అపూర్వమైన సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉందని డాక్టర్ మిశ్రా చెప్పారు. ఇదే సమయంలో వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు, పెరుగుతున్న సామాజిక విభజనలు వంటి తీవ్రమైన అనిశ్చితులు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. “సాంకేతికత లేదా సమాచారాన్ని పెంచడం మాత్రమే కాకుండా, జ్ఞానాన్ని వివేకం, నైతికత, కరుణ, మానవీయ బాధ్యతలతో ముడిపెట్టడమే మానవాళి ముందున్న అసలైన ప్రశ్న” అని అన్నారు.
నలందా విద్యా సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, దాని విభిన్న రంగాల కలయికతో కూడిన విధానాన్ని కొనియాడారు. ఆధునిక కాలంలో కనిపిస్తున్న మేధోపరమైన స్తబ్దతకు పరిష్కారంగా ‘వాదం’ (కఠినమైన చర్చలు, పరిశోధనలు) అలవర్చుకోవాలని సూచించారు. సాంకేతికత మనకు తక్షణ సమాధానాలను ఇవ్వగలదేమో కానీ, అది నైతిక విలువల స్థానాన్ని భర్తీ చేయలేదని, అలాగే మానవ భావోద్వేగాలను, కష్టాలను, గౌరవాన్ని లేదా ఆకాంక్షలను పూర్తిగా అర్థం చేసుకోలేదని తెలిపారు. “సమాచారాన్ని కోల్పోయినప్పుడు నాగరికతలు అంతరించిపోవు, ఆలోచించే సామర్థ్యాన్ని, స్వతంత్ర ఆలోచనా విధానాన్ని కోల్పోయినప్పుడే అవి క్షీణిస్తాయి” అని డాక్టర్ మిశ్రా చెప్పారు.
గతంలో వలసపాలన వల్ల జరిగిన చారిత్రక ప్రభావం గురించి మాట్లాడుతూ.. వలసపాలన మన ఆలోచనా విధానాలను మార్చివేసిందని, ఆయుర్వేదం, బౌద్ధ విజ్ఞానశాస్త్రం (ఎపిస్టెమోలజీ), అర్థశాస్త్రం వంటి సమగ్రమైన మన స్వదేశీ సంప్రదాయాలను పక్కన పెట్టేలా చేసిందని వివరించారు. కాబట్టి 21వ శతాబ్దం ఆలోచనా విధానంలో వలసవాద విముక్తి (ఇంటెలెక్చువల్ డీకాలనైజేషన్) పొందే కాలం కావాలని, మన నాగరికతపై ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది, మన స్వదేశీ జ్ఞాన వ్యవస్థలను ప్రపంచ వేదికపైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. “నలందా విశ్వవిద్యాలయం పునరుద్ధరణ భారతదేశానికి పక్షపాతం లేని సంభాషణలు, బహుళత్వాలపై ఉన్న నమ్మకానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.
విద్యను అందరికీ సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి భారత్ చేస్తున్న కృషిని వివరిస్తూ.. జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా బహుముఖ విద్య, బహుభాషా బోధన, భారతీయ జ్ఞాన వ్యవస్థలను అధికారికంగా విద్యా విధానంలో చేర్చడం వంటి ప్రయత్నాలను ప్రస్తావించారు. అలాగే, ‘నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్’, ‘ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ’ వంటి దేశీయ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కోట్ల కొద్దీ ప్రాచీన గ్రంథాలను కాపాడుతున్నట్లు, మన సంప్రదాయ వైద్య విధానాలు అంతర్జాతీయంగా దుర్వినియోగం కాకుండా రక్షిస్తున్నట్లు తెలిపారు. భాషా అడ్డంకులను తొలగించేందుకు స్వదేశీ అనువాదాల కోసం తీసుకొచ్చిన ‘భాషిణి’ ఏఐ యాప్ గురించి, అంతర్జాతీయ పరిశోధనా పత్రికలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ వంటి కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీవ్రమైన ప్రభావం గురించి మాట్లాడుతూ.. నైతికత, పక్షపాతం, గోప్యత, మానవ ప్రమేయంపై కీలక ప్రశ్నలను లేవనెత్తారు. ప్రస్తుతం ఏఐ మోడల్స్ ఎక్కువగా ఇంగ్లీష్, పాశ్చాత్య దేశాల సమాచారంపైనే శిక్షణ పొందుతున్నాయని, ఇవి ఆసియా, గ్లోబల్ సౌత్ దేశాల వ్యవసాయ, వైద్య లేదా వాతావరణ పరిస్థితులకు సరిపోకపోవచ్చునని హెచ్చరించారు. దీనివల్ల సాంకేతిక నమూనాలకు, స్థానిక పరిస్థితులకు మధ్య ప్రమాదకరమైన వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీనికి సమాధానంగా, మన దేశీయ సాంకేతిక సామర్థ్యాలను, జ్ఞాన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ‘ఇండియా ఏఐ మిషన్’ వంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన నొక్కిచెప్పారు.
ప్రస్తుతం ఆసియా ఖండం ప్రపంచంలోనే ఒక కీలకమైన మలుపులో ఉందని, ఈ ప్రాంతంలోని దేశాల ఆర్థిక వృద్ధి వేగంగా పుంజుకుంటోందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒక ఆశాకిరణంగా మారుతోందని డాక్టర్ మిశ్రా గుర్తించారు. భారతదేశాన్ని తిరిగి ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ జ్ఞాన కేంద్రంగా మార్చాలనే ప్రధానమంత్రి సంకల్పాన్ని గుర్తుచేస్తూ.. ఆర్థిక పోటీతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సామరస్యం సమపాళ్లలో ఉండే సహజీవన ఆధారిత అభివృద్ధి నమూనాను ఆయన సమర్థించారు.
డాక్టర్ మిశ్రా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు, పరిశోధకులకు దిశా నిర్దేశం చేస్తూ.. విద్యార్థులు ఎలాంటి ఎల్లలు లేకుండ పనిచేయాలని సూచించారు. నలందా నేర్పిన నిజమైన పాఠమైన ‘విశాల హృదయం’ తో అన్ని వైపుల నుండి మంచిని స్వీకరిస్తూ, ప్రపంచ సవాళ్లయిన వాతావరణ మార్పులు వంటి వాటికి అంతకంటే ఎక్కువ పరిష్కారాలను సమాజానికి తిరిగి ఇవ్వాలని కోరారు. తన ముగింపు ఉపన్యాసంలో.. విద్యార్థులు స్వేచ్ఛా పరిశోధనతో కూడిన బహుముఖ నాగరికత వారసత్వాన్ని కలిగి ఉన్నారని, అయితే నైతికత లేని విద్య ప్రమాదకరంగా మారుతుందని గుర్తుచేశారు. జ్ఞానం అనేది వినయాన్ని, దాని ద్వారా యోగ్యతను, సంపదను, మంచి ప్రవర్తనను, తృప్తిని ఇస్తుందని వివరించడానికి ‘హితోపదేశం’ లోని ఒక చక్కని శ్లోకాన్ని ఉదహరించారు.
ప్రాచీన స్నాతకోత్సవ సంప్రదాయాలను గుర్తుచేస్తూ ‘తైత్తిరీయ ఉపనిషత్తు’ లోని శిక్షావల్లి 11వ అనువాకాన్ని ప్రస్తావించారు. నైతిక జీవితాన్ని గడపడానికి గురువుగారు చెప్పిన సువర్ణ సూత్రాలైన.. సత్యం మాట్లాడటం, ధర్మాన్ని ఆచరించడం, చదువులో ఎప్పుడూ అలసత్వం వహించకపోవడం వంటివి నేటికీ ఎంతో ప్రాముఖ్యమైనవని చెప్పారు. “విద్య అంటే కేవలం జ్ఞానాన్ని లేదా వృత్తిపరమైన నైపుణ్యాన్ని సంపాదించడం మాత్రమే కాదు. అది మంచి నిర్ణయాధికారాన్ని, వ్యక్తిత్వాన్ని, నైతిక బాధ్యతను పెంపొందించడం” అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్, నలందా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (తూర్పు) రుద్రేంద్ర టాండన్, గవర్నింగ్ బోర్డు సభ్యులు, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు, అధ్యాపకులు, భాగస్వామ్య దేశాల రాయబార కార్యాలయాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *