– జలధార పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
– వేసవి నేపథ్యంలో శ్రామికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా
– సగటు వేతనం రూ. 307 అందేలా ప్రణాళికాయుత కార్యాచరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలంలోని పాతపాడులో ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపడుతున్న జలధార పనులను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికుల హాజరు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రమకు గౌరవం కల్పిస్తూ పారపట్టి మట్టితీశారు.
పనుల్లో పాల్గొంటున్న శ్రామికులతో మాట్లాడి వారికి అందుతున్న వేతనాలు, తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. వేసవి తీవ్రత దృష్ట్యా శ్రామికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పని ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధికి దోహదపడేలా ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామాల్లో చెరువుల అభివృద్ధి, కాలువల శుభ్రపరిచే పనులు, మట్టి పనులు, పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపట్టి గ్రామీణ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పని దినాల కల్పన, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడానికి సంబంధించిన అంశాల్లో నిర్దేశించిన నెలవారీ, త్రైమాసిక, వార్షిక లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. సగటు వేతనం రూ. 307 ఉపాధి హామీ శ్రామికులకు అందేలా ప్రణాళిక ప్రకారంప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. నీటి భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జలధార కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలుచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో పార్థసారథి, డ్వామా క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News