గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి ప్రోత్సాహంతో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో విహార యాత్రతో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులను కలవనున్నారు.
ఈ మేరకు ఏ.టి.అగ్రహారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ, శాసన సభ్యులు గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల పట్ల ఉన్న అపోహలు అన్నింటికి, అందరికీ సమాధానం మీరే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న అపోహలను పారద్రోలారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ర్యాంక్ లు సాధ్యం అని నిరూపించారని అన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ పాఠశాలలను దాటి ప్రభుత్వ పాఠశాలలు వెళ్లాలనే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించి మీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, తమ్ములకు, చెల్లెళ్ళకు స్ఫూర్తిని, ప్రేరణను నింపారని అన్నారు. పిల్లల చదువులకు బాగా సహకరించి, గొప్ప విజయాలు సాధించడంలో తోడ్పాటును తల్లిదండ్రులు అందించడం పట్ల అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించడంలో, విద్యార్థులను తర్ఫీదు ఇవ్వడంలో ప్రత్యేక దృష్టి సారించిన ఉపాధ్యాయులను “మీ బోధన, స్పూర్తి గొప్పదని” అన్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా మీరు నమ్మకాన్ని కలిగించారు. స్పూర్తిగా నిలిచారని ప్రశంసించారు. విద్యార్థులు ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని జిల్లా కలెక్టర్ ప్రేరేపించారు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరని, ఇబ్బందులను అధిగమించి లక్ష్యం చేరే వరకు విశ్రమించ వద్దని సూచించారు. ఇటువంటి మంచి కార్యక్రమంను శాసన సభ్యులు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.
శాసన సభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమం అమలు చేయడం మంచి సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. గల్లీ నుండి ఢిల్లీకి విద్యార్థులు వెళ్ళుటకు ఎల్.వి.ఆర్ అండ్ సన్స్ అధినేత వెంకటేశ్వరరావు, శ్రీ బ్రమర ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్ర రావు ఎంతో సహకారం అందించారని చెప్పారు. ఢిల్లీలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఇతర అతిరథ మహారథులను కలవడానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్ని ఏర్పాట్లు చేసి సహకారం అందించారని తెలిపారు. విద్యార్థులు మంచి స్పూర్తి పొందాలని, భవిష్యత్తులో ఉత్తమ ర్యాంకులు సాధించి, ఉత్తమ స్థాయిలు పొంది, ఉత్తమ పౌరులుగా నిలవాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, ఇతర అధికార, అనధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News