Breaking News

ఏపీఐఐసీ భూసేకరణలో భాగంగా ఎకరాకు రూ.28 లక్షల నష్టపరిహారం అందిస్తాం

-రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుంది
-విద్యార్హత కలిగిన వారికి ఉద్యోగాలు కల్పిస్తాం
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యవేడు మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటీపాకం గ్రామాలలో ఏపీఐఐసీ పరిశ్రమల అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణలో భాగంగా పలు గ్రామాల రైతులతో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్రరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రైతులతో భూసేకరణ, నష్టపరిహారం, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యవేడు మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటీపాకం గ్రామాలలో ఏపీఐఐసీ పరిశ్రమల అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణలో భాగంగా రైతులకు ఎకరాకు రూ.28 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. రైతులు ప్రభుత్వానికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడాలని కోరారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించేలా నిర్ణయం తీసుకుందని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా భూముల్లో ఉన్న మామిడి చెట్లు, ఇతర వృక్షాలు, బోర్‌వెల్లు, షెడ్లు, గోడలు, కట్టడాలు మరియు ఇతర స్థిరాస్తులకు ప్రత్యేక అంచనాల ప్రకారం అదనపు పరిహారం కూడా చెల్లిస్తామని తెలిపారు. భూ పరిహారం, అదనపు పరిహారంతో జత చేస్తే పెద్ద మొత్తంలో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా భూములు ఇచ్చిన రైతుల పిల్లల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి శ్రీ సిటీ పరిధిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు.

రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలా వారికి అండగా ఉంటుందన్నారు. భూసేకరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఏపీఐఐసీ ద్వారా చేపడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగడానికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి మరియు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. అభివృద్ధి మరియు రైతుల సంక్షేమం రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు.

శ్రీసిటీ ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాలు గతంతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు, మౌలిక వసతులు ఏర్పాటు అయ్యి ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.

గతంలో కూడా రైతులు సహకరించి శ్రీసిటీ అభివృద్ధికి భూములు ఇచ్చారని, ఆ సహకారంతోనే ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా శ్రీసిటీ ఎదిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం పారిశ్రామిక అభివృద్ధికి రైతులు సహకరిస్తే భవిష్యత్తులో వారి పిల్లలకు, యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

రైతులు తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు, వెబ్‌ల్యాండ్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. నష్టపరిహారం విషయంలో అభ్యంతరాలు ఉన్న రైతులు చట్టబద్ధంగా ఆర్బిట్రేషన్‌కు వెళ్లే అవకాశం ఉందని వివరించారు. ముందుగా పరిహారం స్వీకరించి తరువాత ఆర్బిట్రేషన్ దాఖలు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.

కోర్టు కేసులు, చట్టపరమైన ప్రక్రియలు ఉన్నప్పటికీ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయని, రాళ్లకుప్పం ప్రాంతానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు పరిష్కారమైన ఆ ప్రాంతంలో కూడా భూ సేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ, రైతుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి స్పందించిన జిల్లా కలెక్టర్‌ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సమావేశంలో సత్యవేడు తహసీల్దార్ శివప్రసాద్, ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటీపాకం గ్రామాల వీఆర్వోలు, భూసేకరణ విభాగ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *