– ఎక్కడికక్కడ చలివేంద్రాలు, నీటి తొట్టెల ఏర్పాటు
– మనిషికే కాదు… మూగజీవాల దాహార్తినీ తీర్చుతున్న అధికార యంత్రాంగం
– ఓ చిన్న నీటి పాత్ర.. ఎన్నో ప్రాణాలకు జీవధార: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మండు వేసవిలో ప్రజలు, పక్షులు, పశువులు దాహంతో ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం మానవత్వంతో ముందుకు సాగుతోంది. జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో సందర్శకులు, పక్ష్యాదుల కోసం ప్రత్యేక తాగునీటి ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో పశువుల తొట్టెలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి.. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన నీటి పాత్రల వద్ద వివిధ రకాల పక్షులు నీరు తాగుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటున్నాయి. మండుతున్న ఎండల్లో జీవరాశుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు చూపుతున్న చొరవ మానవత్వం, బాధ్యతాభావం హృదయాలను హత్తుకుంటున్నాయని, పర్యావరణ పరిరక్షణ పట్ల మన నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయంటూ కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు పేర్కొన్నారు.
ఒక చిన్న నీటి పాత్ర ఎన్నో ప్రాణాలను కాపాడగలదని.. ప్రతి ఇల్లు, కార్యాలయం, విద్యాసంస్థ, కాలనీలో పశుపక్ష్యాదులు, మూగజీవుల కోసం నీటి పాత్రలను ఏర్పాటు చేసి ఈ మంచి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని.. దయను ఒక సామాజిక ఉద్యమంగా మార్చుకుందామని, మానవత్వపు దారిలో సుస్థిర అభివృద్ధి దిశగా పయనిద్దామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News