విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణలో సర్కిల్–III పరిధిలోని నిర్మాణ సంస్థలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో భావన వ్యర్థాల (సి & డి వ్యర్థాలు) నిర్వహణపై అవగాహన సమావేశాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్–3 పి. మోహన్ బాబు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి నిర్మాణ సంస్థ మరియు బిల్డర్ బాధ్యత అని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ గుర్తించిన అధికారిక రవాణా సంస్థల ద్వారానే నిర్మాణ వ్యర్థాలను తరలించి, అజిత్ సింగ్ నగర్‌లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సి & డి ప్లాంట్‌కు మాత్రమే పంపించాలని సూచించారు.
అలాగే నిర్మాణ ప్రదేశాలలో తప్పనిసరిగా అనుమతించిన బిల్డింగ్ ప్లాన్ ప్రదర్శించడంతో పాటు, దుమ్ము, కాలుష్యం మరియు వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రీన్ సేఫ్టీ మ్యాట్స్ ఏర్పాటు చేయాలని, కార్మికులకు తాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని, పరిసర రహదారులు మరియు ప్రజా ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్మాణ కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ “సూపర్ స్వచ్ఛ” లక్ష్య సాధనలో భాగంగా నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని, అందరూ పూర్తి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో సంబంధిత బిల్డింగ్ అధికారుల (బిఓ), ఇన్‌చార్జ్ సిబ్బంది మరియు అధికారిక సి & డి వ్యర్థాల రవాణా కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News