గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బక్రీద్ పండుగ సమయంలో నగరంలో గోవధ జరగరాదని నగర పాలక సంస్థ ఇంచార్జ్ అదనపు కమిషనర్ జి. సాంబశివరావు అన్నారు. శనివారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గోవధ నిషేధం మరియు జంతు వధ నివారణ చట్టం, 1977 క్రింద బక్రీద్ రోజున గోవధ, ఇతర అనధికార జంతువుల వధ పై పశుసంవర్ధక శాఖ, పోలీస్, రెవిన్యూ, పోల్యుషణ్ కంట్రోల్ బోర్డు, నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు, రెవిన్యూ, గో సంరక్షణ సమితి సభ్యులు, ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఇంచార్జ్ అదనపు కమిషనర్ మాట్లాడుతూ, అనధికార జంతు వధ నిషేదమని, నగర పాలక సంస్థ ఏర్పాటు చేసే తాత్కాలిక జంతు వధశాలను వినియోగించుకోవాలన్నారు. గోవధ నిరోధక చట్టం 1977 మరియు పశు సంరక్షణ చట్టం సెక్షన్ 05 ప్రకారం రాష్ట్రంలో మగ లేదా ఆడ అయినటువంటి ఆవు, దూడలను, చూడి పశువులను, 3 నెలల్లోపు దూడలు కల్గిన పశువులను ఎట్టి పరిస్థితిలలోను వధించరాదని స్పష్టం చేశారు. అధికారికంగా ధృవీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని, పోలీస్ శాఖ స్పష్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు. కనుక బక్రీద్ పండుగ ప్రశాంతమైన వాతారణంలో నిర్వహించుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మసీదుల్లో ముస్లిం పెద్దలు గోవధ నిషేధము, పండుగ నిర్వహణ పై సూచనలు చేయాలన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో జియంసి ప్రజారోగ్య అధికారులు మరియు ఇతర శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.
అనంతరం హిందూ సంఘాల ప్రతినిధులు గోవధ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ముస్లిం మత పెద్దలు గోవధ జరగకుండా పండుగ శాంతియుత వాతావరణంలో చేసుకొనేలా మసీదుల ద్వారా ముస్లింలకు అవగాహన కలిగిస్తామన్నారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాస్, సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ,డియస్పి షేక్ అబ్దుల్ అజీజ్, యంహెచ్ఓ డాక్టర్ సురేష్, పశుసంవర్ధక శాఖ అధికారులు నాగేశ్వర రావు,రెవిన్యూ అధికారులు, పోల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, గో సంరక్షణ సమితి సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News