– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15వ తేదీన పెట్రోల్ డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలను పెంచిన కేంద్రం వెంటవెంటనే మరో రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రూ. 4.80 పైసలు అదనపు భారం ప్రజలపై మోపింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గించని మోడీ ప్రభుత్వం, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు కొంచెం పెరగగానే ధరలను విపరీతంగా పెంచేసింది. దీనికి తోడు సుంకాలు పలు రకాల అదనపు టాక్స్ లతో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచి సామాన్యుని నడ్డి విరుస్తున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియగానే ధరల భారాన్ని ప్రజలపై మోపడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఒకవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగగా, మరోవైపు రైతులకు ఎరువులు విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజానీకం అధిక ధరల భారంతో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నరేంద్ర మోడీ కల్పిస్తున్నారు.
ప్రజా సంక్షేమం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందనటానికి ఒకవైపు ధరల పెరుగుదల కారణమైతే, మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ పతనమవ్వటం తార్కాణం. మోడీ 12 ఏళ్ల పాలనలో రూపాయి విలువ దిగజారి ఒక డాలర్ కు రూ. 96.25 పైసలు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. రూపాయి మరింత పతనమై ఒక డాలర్ రూ.100కు చేరే పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా మోడీ దేశాన్ని అప్పులమయం గావించారు. అన్ని రకాల వస్తువుల ధరలను పెంచారు. నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసారు.
నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో దేశానికి ఏం చేశారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అన్ని రంగాల్లో విఫలమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. దాని పర్యవసానమే సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుకు కోట్లాదిమంది మద్దతు ప్రకటించడం జరుగుతున్నది. ప్రజా శ్రేయస్సు పట్ల మోడీ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News