విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ఎన్టీఆర్ పరిపాలనా భవనంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్ గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్ గా సీహెచ్ మెహర్ రమేష్ లు ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పి. భరత్ భూషణ్ మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో సినిమా, కళలు, నాటకరంగ అభివృద్దికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పి. భరత్ భూషణ్ మాట్లాడుతూ… తనకు ఈ పదవి ద్వారా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ లకు కృతజ్ఞతలు తెలిపారు. 1984లో నందమూరి తారకరామారావు డి.వి.యస్. రాజు అధ్యక్షతన ఇలాంటి పూర్తిస్థాయి కమిటీని వేశారని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం సినిమా రంగానికి సంబంధించి కొత్త కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, సినీ రంగంపై ఉన్న ప్రేమతో, ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో తనకు పూర్తి సహకారం అందించారని, అందుకు వారికి జీవితకాలం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ల సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర రంగ అభివృద్ధికి, సినీ పరిశ్రమ విస్తరణకు తన వంతు బాధ్యతగా పూర్తి కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ చిక్కాల మెహర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా పరిశ్రమ పురోగతి సాధిస్తుందన్నారు. ఒకప్పుడు తమిళనాడు, ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలివెళ్లిన చిత్ర పరిశ్రమను, మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంచి “ఫిలిం ఫ్రెండ్లీ” వాతావరణం కల్పించేందుకు ఈ బోర్డుని ఎంపిక చేశారని తెలిపారు. రాష్ట్రంలో సినిమా మౌలిక వసతుల అభివృద్ధి చేయడంతో పాటు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పారు. గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే తాను ఈ బోర్డులోకి వచ్చానన్నారు.
రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో కళలు, సినిమా, నాటకం మరియు టీవీ రంగాలకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదని, ఈ రంగాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీల నాయకత్వంలో రాష్ట్రంలో కళల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
గతంలో నిలిచిపోయిన నంది అవార్డుల ప్రకటన, నంది నాటకోత్సవాలను మళ్లీ ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బలోపేతం చేసే విధంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్ చిక్కాల మెహర్ రమేష్, బోర్డు డైరెక్టర్ల ఆధ్వర్యంలో తెలుగు సినీ, నాటక, టీవీ రంగాల అభివృద్ధికి సరికొత్త కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అరకు వ్యాలీ, మారేడుమిల్లి, తిరుపతి, అమరావతి వంటి అద్భుతమైన లొకేషన్లు ఏపీలో ఉన్నాయని, కేవలం తెలుగు చిత్రాలే కాకుండా తమిళ్, బెంగాలీ చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జరుపుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో షూటింగ్ లొకేషన్లకు కొదవలేదని, అయితే సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి నిర్మాతలు, సినీ పెద్దలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు సినిమా పరిశ్రమకు కీలక కేంద్రంగా ఉన్న విజయవాడకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చలన చిత్ర రంగంలో మళ్లీ పూర్వవైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్‌గా నియమితులైన పి. భరత్ భూషణ్, వైఎస్ చైర్మన్ గా చిక్కాల మెహర్ రమేష్, సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్, కమిటీ డైరెక్టర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1975లో ప్రారంభమైన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర విభజన అనంతరం 2017లో నవ్యాంధ్రలో అంబికా కృష్ణ చైర్మన్‌షిప్‌లో తిరిగి ఏర్పాటైన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా చిత్ర పరిశ్రమకు విజయవాడ ఒక రాజధానిగా, ప్రధాన కేంద్రంగా విలసిల్లిందని, ఇప్పటికీ సినిమాల ఆదాయంలో 65% నుండి 70% వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని పేర్కొన్నారు.
చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం, షూటింగులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతుల నుండి పోలీస్ ప్రొటెక్షన్ వరకు అన్ని ఒకే చోట లభించేలా “సింగిల్ విండో సిస్టమ్” ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో ఉన్న నంది పురస్కారాలు, కందుకూరి పురస్కారాల వంటి వాటిని పునరుద్ధరించాలని, చలనచిత్ర రంగానికి మరిన్ని రాయితీలు కల్పించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు.
పరిశ్రమను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రస్తుతం థియేటర్ల యజమానులు, పంపిణీదారులు (డిస్ట్రిబ్యూటర్లు), సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారన్నారు. సినిమాను ఎలా తీయాలో ఆలోచించడం పక్కన పెట్టి, చిత్ర పరిశ్రమను ఎలా బతికించుకోవాలి అనేదానిపై ధృష్టి నిలపాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు పూర్తి లాభదాయకంగా ఉండేలా కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నామన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా తమ వంతు సహకారాన్ని అందించి ఉభయ రాష్ట్రాలు పరిశ్రమను ఆదుకోవాలని నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్ స్వాగతోపన్యాసం చేస్తూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్, వైస్ చైర్మన్లు మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. 1975లో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఈ సంస్థను ప్రారంభించారన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం 2017లో శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏపీలో ఈ ఆఫీస్‌ను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆలోచనల మేరకు అమరావతిని కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే ఒక ‘క్రియేటివ్ క్యాపిటల్’ (సృజనాత్మక రాజధాని) గా మార్చడం ప్రధాన లక్ష్యం అన్నారు. సినిమా రంగానికి చెందిన అనుభవజ్ఞుల సలహాలు, పర్యాటక శాఖ మంత్రి సహకారంతో ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఏపీఎఫ్డీసీ వేగంగా పనిచేస్తుందని డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ స్పష్టం చేశారు.
నూతన డైరెక్టర్ గా నియమితులైన హీరో సుమన్ మాట్లాడుతూ….. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , శాసనసభ్యులు బాలకృష్ణ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమను, సినీ కార్మికులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం, నెల్లూరు లాంటి సముద్ర తీరాలు, అరకు లాంటి హిల్ స్టేషన్లు, గ్రామీణ ప్రాంతాలు షూటింగులకు ఎంతో అనుకూలమైనవన్నారు. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, ఉత్తర భారదేశం చిత్రాల షూటింగులు ఇక్కడ జరుపుకునేలా ఆహ్వానించేలాగా చర్యలు ఉంటాయని చెప్పారు. తన అనుభవం, ఇతర భాషల సినిమాలపై ఉన్న అవగాహనతో ఏపీ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణుల ఉపాధికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని డైరెక్టర్ సుమన్ తల్వార్ హామీ ఇచ్చారు.
డైరెక్టర్ గా నియమితులైన నటి వై. ఝాన్సీ మాట్లాడుతూ… రాష్ట్రానికి గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు ముఖ్యమంత్రిగా సేవలందించడం తెలుగు ప్రజలతో పాటు చిత్ర పరిశ్రమ అదృష్టమన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా రంగం నుంచి వచ్చి రాష్ట్రాన్ని నడిపించడం తెలుగు పరిశ్రమకు ఆశాకిరణమన్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఆలోచనతో ఏర్పాటైన ఈ బోర్డులో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి చేసిన కృషి ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సినిమా రంగానికి “బాక్సాఫీస్ అన్నపూర్ణ”గా అభివర్ణిస్తూ, అభిమానులు, థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కలెక్షన్లు అధికంగా ఏపీలోనే ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగాల సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా చైర్మన్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, కళాకారులు, ఉన్నతాధికారులతో కూడిన 17 మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది.
నూతన పాలకమండలి (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్) వివరాలు…
పి. భరత్ భూషణ్ (చైర్మన్)
చిక్కాల మెహర్ రమేష్ కుమార్ (డైరెక్టర్)
సుమన్ తల్వార్ (డైరెక్టర్)
ఎస్. శివాజీ (డైరెక్టర్)
చందలవాడ శ్రీనివాసరావు (డైరెక్టర్)
బుర్రా సాయిమాధవ్ (డైరెక్టర్)
వై. ఝాన్సీ (డైరెక్టర్)
కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద (వివేక్ కూచిభొట్ల) (డైరెక్టర్)
వి. సముద్ర (డైరెక్టర్)
కె. ఉమామహేశ్వరరావు (డైరెక్టర్)
మీర్ ఎస్ (డైరెక్టర్)
కందిమళ్ళ సాంబశివరావు (డైరెక్టర్)
ఎస్. వెంకట కృష్ణారెడ్డి (డైరెక్టర్)
జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్ (డైరెక్టర్)
డి. సత్యనారాయణ (డైరెక్టర్)
అదనపు కార్యదర్శి, ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ (ఎక్స్-అఫీషియో డైరెక్టర్), జాయింట్ సెక్రటరీ, ప్రభుత్వ ఆర్థిక శాఖ (ఎక్స్-అఫీషియో డైరెక్టర్), మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఎక్స్-అఫీషియో డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ ముడావత్ శ్రీనివాస్ నాయక్ వందన సమర్పణ చేస్తూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, బోర్డు డైరెక్టర్లకు హృదయ పూర్వ అభినంధనలు తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, నవ్యంద్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇంఫా ముంబాయికి చెందిన సభ్యులు, టీవీ, నాటక రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News