-త్వరలోనే జనగణనను కూడా 100% పూర్తి చేస్తాం : కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెన్సస్–2027 కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న గృహ గణన కార్యక్రమం 99 శాతం విజయవంతంగా పూర్తి చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం. తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి గృహాన్ని గుర్తించి వివరాలను నమోదు చేసే ప్రక్రియను అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమన్వయంతో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు గృహ గణనను 99 శాతం పూర్తి చేయగలిగామని, అయితే జనగణన ప్రక్రియ ప్రస్తుతం 67 శాతం వరకు మాత్రమే పూర్తైందని పేర్కొన్నారు.
వేసవి సెలవుల నేపథ్యంలో అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం, కొన్ని ఇళ్లు తాళాలు వేసి ఉండడం వంటి కారణాల వల్ల జనగణన ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగిందని ఆయన వివరించారు. అయినప్పటికీ, ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు ప్రతిరోజూ డోర్‌లాక్ ఇళ్లను ప్రత్యేకంగా గుర్తించి పర్యవేక్షిస్తూ, ఆయా కుటుంబాలు తిరిగి వచ్చిన వెంటనే వారి వివరాలను నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
సెన్సస్ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యమైన జాతీయ కార్యక్రమమని, ప్రజలు తమ వివరాలను సక్రమంగా అందించి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఖచ్చితమైన గణాంకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, భవిష్యత్ ప్రణాళికలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం గృహ గణన విజయవంతంగా పూర్తికావడానికి నగర ప్రజలు అందించిన సహకారం అభినందనీయమని, అదే విధంగా జనగణన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని సహకరించాలని కోరారు. త్వరలోనే జనగణనను కూడా 100 శాతం పూర్తి చేస్తామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.
Prajavartha Online Telugu News