– వ్యవసాయం నుంచి ఆక్వా వరకు ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి
– ఎండలు, మార్కెట్ సంక్షోభాలపై హై అలర్ట్
– ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఫోకస్
– ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
– రైతులకు సాంకేతిక సహాయం, సబ్సిడీలు, మార్కెట్ మద్దతు
– రైతులు ఆందోళన చెందవద్దు
– రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ లేదు
– వైసీపీ అసత్య ప్రచారాలపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్
– గత ఐదేళ్లు రైతులు అగాదంలోకి వెళ్లారు…కూటమి ప్రభుత్వంలోనే మంచి ధరలు లభిస్తున్నాయన్న మంత్రి అచ్చెన్న
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా పనిచేస్తోందని, రైతాంగ ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ,అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా లభ్యత నుంచి మొక్కజొన్న ధరలు, రొయ్యల మార్కెట్ పరిస్థితులు, కొబ్బరి రైతుల సమస్యలు, అనంతపురం నీటి ఎద్దడి వరకు ప్రతి అంశంపై వ్యవసాయ, అనుబంధ శాఖల డైరెక్టర్స్ తో మంత్రి జూమ్ సమావేశం నిర్వహించి ప్రతి అంశంపై లోతైన చర్చ జరిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతు సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడదు. ప్రజా సమస్యలను పరిష్కరించడం మా లక్ష్యం. కానీ వైసీపీ నాయకులు మాత్రం సమస్యల పరిష్కారంపై కాకుండా రాజకీయ లాభాల కోసం అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలను బాగా అర్థం చేసుకుంటున్నారు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అధికారులు వివరించారు. అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా మార్కెట్ పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోంది. మధ్యవర్తుల దోపిడీని అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా వచ్చిన తాత్కాలిక పరిస్థితులను అధిగమించేందుకు మత్స్యశాఖ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సమావేశంలో చర్చించారు. కొబ్బరి రైతులకు మద్దతుగా మార్కెటింగ్ అవకాశాలు పెంచడం, సహాయక చర్యలు చేపట్టడం పై ఉద్యానవన శాఖకు మంత్రి దిశానిర్దేశం చేశారు. నీటి ఎద్దడిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ చర్యలు అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అసాధారణ ఎండలు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు వంటి సవాళ్ల మధ్య కూడా రైతులు, పౌల్ట్రీ, ఆక్వా, ఉద్యాన రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్న భీకర ఉష్ణోగ్రతల కారణంగా పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, గత నాలుగు రోజులుగా నమోదైన వడగాల్పుల ప్రభావంతో రాష్ట్రంలోని సుమారు 5.5 కోట్ల కమర్షియల్ లేయర్ కోళ్లలో 2.5 శాతం నుంచి 3.5 శాతం వరకు మరణాలు సంభవించినట్లు ప్రాధమిక అంచనా అని వెల్లడించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఒక్క కోడికి రూ.100 చొప్పున గరిష్టంగా 100 కోళ్ల వరకు, ఒక్క లబ్ధిదారునికి గరిష్టంగా రూ.10,000 వరకు పరిహారం అందించవచ్చని పేర్కొన్నారు. అయితే నష్టం అంచనా రూ.10,000 కంటే అధికంగా ఉన్న సందర్భాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ప్రత్యేక సహాయం అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.
గతం ప్రభుత్వంలో 2020-21 ఖరీఫ్‌లో 1,98,092 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో రూ.95.62 కోట్ల నష్టం, అదే ఏడాది రబీలో 2,98,391 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో రూ.91.50 కోట్ల నష్టం, 2021-22 రబీలో 2,762 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో రూ.0.19 కోట్ల నష్టం, 2022-23 రబీలో 71,064 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో రూ.2.44 కోట్ల నష్టం సంభవించినప్పటికీ ప్రస్తుతం రైతులకు నష్టం లేకుండా సమర్థవంతమైన విధానంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. రైతులను కాపాడేందుకు మార్క్ ఫెడ్ ద్వారా 2.04 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను MSP వద్ద కొనుగోలు చేయాలని నిర్ణయించి, Price Stabilization Fund (PSF) నుంచి రూ.630 కోట్ల అడ్వాన్స్ మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు.
అనంతపురం జిల్లాలో గార్లదిన్నె, సింగనమల, బుక్కరాయసముద్రం, కంబదూరు, సెట్టూరు, ఆత్మకూరు, యాడికి మండలాల్లోని సుమారు 37 వేల హెక్టార్ల బత్తాయి, నిమ్మ విస్తీర్ణంలో దాదాపు 2,260 హెక్టార్లు నీటి ఎద్దడికి గురైనట్లు వివరించారు. రెండు నెలల క్రితమే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, డ్రిప్ ఇరిగేషన్ ఆటోమేషన్ పథకానికి హెక్టారుకు రూ.40 వేల వ్యయంపై రూ.22 వేల రాయితీ, డబుల్ లేటరల్ డ్రిప్ వ్యవస్థకు హెక్టారుకు రూ.41,850 వరకు సబ్సిడీ, 20x20x3 మీటర్ల రైతు నీటి కుంటలకు రూ.90 వేల రాయితీతో పాటు ఫెన్సింగ్‌కు అదనంగా రూ.15 వేల సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. వీడ్ మ్యాట్ వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి పంటలో గత ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు నమోదైన భారీ వర్షాలు, అధిక తేమ, తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల పువ్వులు, పిందెలు రాలిపోవడంతో దిగుబడులు తగ్గాయని తెలిపారు. సాధారణంగా ఎకరాకు 1,000 నుంచి 1,200 కాయల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 600 నుంచి 800 కాయలకే పరిమితమైందన్నారు. అయితే ఇది పూర్తిగా తాత్కాలిక పరిస్థితి మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొత్త కొబ్బరి కురిడి వెయ్యింటికి రూ.15,000, పాతకాయ గండేరా రూ.30,000, గుటుగుటు రూ.25,000, కొత్తకాయ గండేరా రూ.28,000, కొత్తకాయ గుటుగుటు రూ.24,000, పాత ముక్కుడు కాయ రూ.15,000–16,000, కొత్త సచ్చి కాయ రూ.15,000–16,000 మధ్య ధర పలుకుతోందని, కొబ్బరి నూనె 15 కిలోల టిన్ రూ.5,000, కిలో ధర సుమారు రూ.350గా ఉందని తెలిపారు. జ్యేష్ఠ మాసం ముగిసిన వెంటనే ఉత్తరాది రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు.
Prajavartha Online Telugu News