-మచిలీపట్నంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి నూతన ఆధార్ సేవా కేంద్రం ప్రారంభించిన మంత్రి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగరంలో ప్రజలకు మరింత చేరువలో ఆధార్ సేవలు అందుబాటులో వచ్చాయని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
సోమవారం ఉదయం మంత్రి మచిలీపట్నం నగరంలోని కొజ్జిలిపేట కెనెడీ రోడ్డులో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) ఆధ్వర్యంలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఆధార్ ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ సేవకు అనుసంధానమైందని తెలిపారు. బ్యాంక్ ఖాతాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలన్నింటికీ ఆధార్ తప్పనిసరిగా మారిందన్నారు. అయితే ఆధార్‌లో మార్పులు చేయించుకోవడం లేదా కొత్త ఆధార్ పొందడం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా మచిలీపట్నంలో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు కావడం అభినందనీయమని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు మచిలీపట్నంలో కూడా ఈ కేంద్రం ప్రారంభం కావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
చలపల్లి రోడ్డులో కాంగ్రెస్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఈ ఆధార్ సేవా కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, ఆధార్ వివరాల సవరణ, ఫోటో మార్పులు, వేలిముద్రలు, ఐరిస్ అప్‌డేట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆధార్ కార్డులో ఎలాంటి పొరపాట్లు ఉన్నా వాటిని సరిచేసుకునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. కేంద్రాన్ని ఏర్పాటు చేసిన యూఐడిఏఐ సిబ్బంది సంబంధిత అధికారులను మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో యుఐడిఏఐ డైరెక్టర్ కె.ఎం. భారతి, అసిస్టెంట్ మేనేజర్ వరప్రసాద్, బి.ఎల్.ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ జోనల్ మేనేజర్ మనీష్ జవాల్కర్, రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ కుమార్, క్లస్టర్ మేనేజర్ హరినాథ్, కృష్ణాజిల్లా ఆధార్ కేంద్రం ఆపరేటింగ్ మేనేజర్ ఎస్ లలిత, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News