– లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులకు తావులేకుండా చూడాలి
– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అధికారులు పనిచేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారుల సంతృప్తి స్థాయి అత్యంత ముఖ్యమని, లబ్ధిదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా సేవలందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. పెన్షన్ పంపిణీ అధికారుల (పీడీవో)తో సమావేశమయ్యారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సామాజిక భద్రత పెన్షన్లు పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా సమాజంలో బలహీన వర్గాలకు భద్రమైన జీవితాన్ని అందిస్తాయని.. అందువల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పథకం ప్రజలకు అత్యంత చేరువైన సేవగా నిలుస్తోందన్నారు. జిల్లాలో వివిధ రకాల పెన్షన్ల కింద ప్రతినెలా దాదాపు 2,26,396 మంది లబ్ధిదారులకు రూ. 98.52 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పెన్షన్ అందుకునే ప్రతి లబ్ధిదారుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని స్పష్టం చేశారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, సమయపాలన పాటిస్తూ ఫిర్యాదులకు తావులేకుండా చూడాలని సూచించారు. పెన్షన్ పంపిణీ అనంతరం నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను అధికారులు నిరంతరం పరిశీలించాలని.. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చేలా క్షేత్రస్థాయిలో సేవల నాణ్యత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. లబ్ధిదారులతో మర్యాదగా ప్రవర్తించడం, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటిదగ్గరే పెన్షన్ అందించడం, అవినీతి రహిత సేవలు అందించే విషయంలో ప్రతి అధికారీ నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల స్ఫూర్తికి అనుగుణంగా ప్రతిఒక్కరూ సేవలందించాలని.. ఎవరైనా సేవలందించడంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం అధికారుల బాధ్యత కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News