-సైనింగ్- గ్రౌండింగ్- ఓపెనింగ్ విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం
-ప్రతీ రంగంలోనూ ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి అవకాశాలు
-38 ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన
-రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం
-జెన్ -జీ కలల సాకారానికి కార్యాచరణ
-ఎంస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదిక ప్రారంభించిన ముఖ్యమంత్రి
మెటా, అమెజాన్ సహా వివిధ సంస్థలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా తయారైన ఉత్పత్తులు ప్రపంచ విపణికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిగా ఎంఎస్ఎంఈ రంగం ఉందని… భారీ పరిశ్రమలు దేశానికి ప్రతిష్ఠ తీసుకువస్తే.. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు లక్షల మందికి జీవనోపాధిని కలిగిస్తాయని అన్నారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు ముఖ్యమంత్రి హాజరయ్యారు. అంతకుముందు 4.4 ఎకరాల్లో 1.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఒకేసారి 1500 మంది హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేలా కన్వెషన్ సెంటర్ నిర్మించటం సంతోషమన్నారు. అమరావతిలోనూ ఈ తరహా కన్వెన్షన్ సెంటర్లను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో మరో ఐదు కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనున్నట్టు సీఎం తెలిపారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాట్లను… చేయూతను ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉంది. యువత కలలకు, మహిళ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉన్న ఈ రంగం వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తోంది. ఏపీలో వనరులకు, అవకాశాలకు కొదవలేదు. వీటిని వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలకు అవకాశాలు కల్పిస్తున్నాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, రైల్వే లాంటి లాజిస్టిక్స్ కూడా ఏపీలో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ, ఎంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలు తెచ్చి ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఎంఎస్ఎంఈ సమ్మిట్ కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి. కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. పారిశ్రామిక యానిట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలోనూ 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 100 పార్కులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇవాళ మరో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశాం. త్వరలో ఈ 138 పారిశ్రామిక పార్కులు సిద్ధం అవుతాయి. మిగిలిన వాటిని జూలై నాటికి శంకుస్థాపనలు చేసి అన్ని మౌలిక వసతులూ కల్పిస్తాం. ఈ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు.”అని ముఖ్యమంత్రి అన్నారు.
APCMEPకు రూ. 300 కోట్లు
“ఈ సమ్మిట్ ద్వారా స్టార్టప్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు, నిపుణులు, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్దిదారులు ఒకే వేదికపైకి వచ్చారు. వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలి. రాష్ట్రంలో 20.77 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.558 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చాం. పీఎంఈజీపీ, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, పీఎం విశ్వకర్మ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేస్తూ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎంట్రప్రెన్యూర్ ప్రోగ్రామ్ కింద రూ.300 కోట్లను కేటాయిస్తున్నాం. రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాం. ఏపీఐఐసీలో ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించే ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకూ 2953 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు అయ్యాయి. వీటి ద్వారా రూ.4.68 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరాయి. ప్రైవేటు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తాం. ప్రైవేటు రంగంలో శ్రీసిటీ ఓ విజయవంతమైన పారిశ్రామిక పార్కు.” అని ముఖ్యమంత్రి అన్నారు.
ఏపీ నుంచి 100 యూనికార్న్ కంపెనీలు లక్ష్యం
“రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలో 5 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతామని … మహిళా సంఘాల వద్ద ప్రస్తుతం రూ.28 వేల కోట్ల కార్పస్ ఉంది. ఏపీ నుంచి 100 యూనికార్న్ కంపెనీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఏపీని ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది ప్రభుత్వ నినాదం. గ్రామీణ ప్రాంతాలకు టెక్నాలజీ తీసుకువెళ్లాలనే లక్ష్యంతో స్మార్ట్ విలేజ్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం. ఓ పరిశ్రమ వ్యర్ధాలు మరో పరిశ్రమకు ముడి సరుకుగా మారుతుంది. సర్క్యులర్ ఎకానమీపై ఎంఎస్ఎంఈలు దృష్టి పెట్టాలి. ఎంఎస్ఎంఈలు ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలన్న లక్ష్యంతో మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం.”అని ముఖ్యమంత్రి తెలిపారు.
జెన్ జీ వర్గం యువత కలల్ని సాకారం చేస్తాం
“మెటా, అమెజాన్ లాంటి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు యువత భవిష్యత్తుకు ఉపాధికి, నైపుణ్యాలకు కొత్త దారుల్ని సృష్టిస్తాయి. మారుతున్న టెక్నాలజీ… ఉద్యోగాల స్వరూపాన్ని మారుస్తోంది. అందుకే టెక్నాలజీ స్కిల్ బిజినెస్ ఇంటిగ్రేషన్ మోడల్ ను అనుసరిస్తున్నాం. పరిశ్రమలకు అనువైన స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టాం. ఆధునిక టెక్నాలజీ ఎకోసిస్టమ్ ద్వారా రాష్ట్ర యువతకు గ్లోబల్ స్థాయిలో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఏఐ, మెటలర్జీ, లాజిస్టిక్స్, క్లీన్ ఎనర్జీ ఏవియేషన్ లాంటి ఫంక్షనల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం… పరిశ్రమలకు నైపుణ్యాలు అందించే కేంద్రాలుగా ఇవి మారబోతున్నాయి. జెన్- జీ, జెన్- ఆల్ఫా, టీనేజర్లకు మేలు కలిగేలా… వారి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా కీలకమైన అంశం. యువశక్తి, టెక్నాలజీ, పరిశ్రమల భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తాం. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లతో ఏపీ అభివృద్ధి చేస్తున్నాం. ప్రతీ రంగంలోనూ ఎంఎస్ఎంఈలు పెట్టుబడులు పెట్టేందుకు ఆస్కారం ఉంది. ప్రధాని మోదీ ఇచ్చిన చిప్ టు షిప్ అన్న నినాదాన్ని నిజం చేసేలా తయారీ రంగంపై దృష్టి పెట్టాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్నది ప్రభుత్వ విధానం.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా సీఎం సమక్షంలో మెటా, అమెజాన్, జోహో సహా వివిధ సంస్థలతో ఏపీ ఎంఎస్ఎంఈడీసీ ఒప్పందం కుదుర్చుకుంది. డీప్ టెక్ స్టార్టప్ కంపెనీలకు రూ.20 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు సిడ్బీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నేతృత్వంలోని స్టార్టప్ కంపెనీలు తయారు చేసిన టెక్నాలజీ ఎనేబుల్డ్ హ్యాండ్ ఇతర ఐటీ, టెక్ ఉత్పత్తులు, డిఫెన్స్ ఉత్పత్తులు, BHEL తయారు చేసిన ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, ప్రైవేట్ సంస్థలు రూపొందించిన డ్రోన్ బోట్లు, వివిధ రకాల గిరిజన ఉత్పత్తులను సీఎం తిలకించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News