-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ , విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో నగరాభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షన్ చర్యలు, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం మరియు రానున్న బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నగర సౌందర్యాన్ని మరింత పెంపొందించేందుకు, కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆధునిక ఫౌంటెన్లు ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో రహదారులు, పార్కుల అభివృద్ధి, నిర్వహణ పనులను మరింత సమర్థవంతంగా చేపట్టే అంశాలపై చర్చించారు.
స్వచ్ఛ సర్వేక్షన్-2026లో విజయవాడకు మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంపై విఎంసి చేపడుతున్న చర్యలను సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా నగరవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, వాటి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన పూర్తిగా నివారించబడినప్పటికీ, ఆ పరిస్థితిని నిరంతరం కొనసాగించేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా బహిరంగ మలమూత్ర విసర్జనకు అవకాశం ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి, నివారణ చర్యల్లో భాగంగా అక్కడ అద్దాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. పండుగకు సంబంధించి కబేళాల నిర్వహణ, పారిశుధ్య చర్యలు, తాగునీటి సౌకర్యాలు, వ్యర్థాల సకాలంలో తొలగింపు వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. గోవధ నిషేధం, జంతు సంక్షేమ చట్టాలను పటిష్టంగా అమలుచేసేందుకు సమన్వయ శాఖల అధికారులు సమష్టిగా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇన్చార్జ్ పి. సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News