– అగ్ని ప్రమాదాలపై వేగవంతమైన స్పందన ముఖ్యం
– కమ్యూనికేషన్ వ్యవస్థ క్రియాశీలంగా ఉండాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల పట్ల అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం విజయవాడ బస్ స్టేషన్ సమీపంలోని ఫైర్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. అగ్నిమాపక వాహనాలు, రెస్క్యూ పరికరాలను పరిశీలించారు. అత్యవసర సేవలకు వినియోగించే ఉపకరణాలను పరిశీలించారు. ఎత్తయిన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించే ప్రత్యేక వాహనాన్ని పరిశీలించి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఫైర్ స్టేషన్‌లోని కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును కూడా సమీక్షించారు. అత్యవసర సమాచారాన్ని అందుకునేలా, చేరవేసే విధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ క్రియాశీలంగా ఉండాలన్నారు. ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో ఫైర్ సర్వీసెస్ కీలక భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు. వేసవి కాలంలో షార్ట్ సర్క్యూట్లతో పాటు వివిధ కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని… ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అప్రమత్తంగా ఉండి భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ఫైర్ 101 సర్వీసు ద్వారా వచ్చే కాల్స్‌తో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్, డయల్ 100 ఇలా వివిధ మార్గాల ద్వారా వచ్చే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
కలెక్టర్ వెంట జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, సహాయ అగ్నిమాపక అధికారి సీహెచ్ సూర్యప్రకాశ్‌రావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News