– జులై 21 నుంచి మార్చి 15 వరకు మలి దశ కార్యక్రమం
– సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
– జిల్లా, మండలం, మునిసిపల్ స్థాయి కమిటీలు నిబద్ధతతో కృషిచేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి వెలుగుబాట అయిన అక్షరాంధ్ర కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని.. 2027 నాటికి ఎన్టీఆర్ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండో దశ కార్యక్రమం కింద ఈ ఏడాది జులై 21 నుంచి 2027, మార్చి 15 వరకు తరగతులు జరుగుతాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం అక్షరాంధ్ర రెండో దశ కార్యక్రమంపై వయోజన విద్య, పంచాయతీరాజ్, మునిసిపల్, విద్య, డ్వామా, సెర్ప్, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల అధికారులతో నగరంలోని వీఎంసీ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాస్యత ఉద్యమంలో రాష్ట్రంలో తొలి అయిదు జిల్లాల్లో ఎన్టీఆర్ జిల్లా స్థానం సంపాదించిందని.. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి అక్షరాస్యత లక్ష్యాలను చేరుకునేందుకు సరైన ప్రణాళికతో పనిచేసినట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి 3.20 లక్షల మంది నిరక్షరాస్యుల్లో ఇప్పటికే దాదాపు లక్ష మంది అక్షరాస్యులయ్యారని తెలిపారు. ఇప్పుడు 2026-27కు సంబంధించి 87,477 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే రెండో దశ బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వయోజనులైన నిరక్షరాస్యులను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా గుర్తించడం జరిగిందని, వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేయాలన్నారు. నిరక్షరాస్యులైన వయోజనులు, వలంటీర్ టీచర్ల రిజిస్ట్రేషన్, యాప్‌లో అప్‌లోడింగ్, జిల్లాస్థాయి, మండలస్థాయి శిక్షణ కార్యక్రమాల అనంతరం 100 గంటల పాటు జరిగే తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఈ తరగతుల్లో ఫంక్షనల్ లిటరసీతో పాటు ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆడియో విజువల్స్, క్లాస్‌రూమ్ బోధన, ప్రాక్టీస్ వర్క్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలలో వారికి అసెస్‌మెంట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. సమన్వయ శాఖల అధికారులు, జిల్లా, మండల, మునిసిపల్ స్థాయి కమిటీలు నిబద్ధతతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి జి.ప్రసాదరావు, డీఈవో ఎల్.చంద్రకళ, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, డీపీవో పి.లావణ్యకుమారి, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డ్వామా పీడీ ఎ.రాము తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News