– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఎంపికైన 250 మంది విద్యార్థులకు త్వరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత జిల్లాల్లోని ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ కార్యాలయాల్లో, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సమక్షంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన పత్రాల వివరాలను ఇప్పటికే వెల్లడించామని, వెరిఫికేషన్ తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. అదనంగా 50 మంది విద్యార్థులను రిజర్వ్ జాబితాలో ఉంచినట్లు తెలిపారు. ఎంపికైన 250 మంది విద్యార్థుల్లో ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అర్హత ప్రమాణాలు పూర్తి చేయలేకపోయినా లేదా ఇతర కారణాలతో అనర్హులుగా తేలినా, రిజర్వ్ జాబితాలో ఉన్న అభ్యర్థులకు వారి ర్యాంకుల ఆధారంగా ప్రాధాన్యత కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన 250 మందిలో 70 శాతం ఎంపీసీ, 30 శాతం బైపీసీ విద్యార్థులకు, మహిళలకు 41 శాతం కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థులు ఏ నిష్పత్తిలో దరఖాస్తు చేసుకున్నారో, అదే నిష్పత్తిలో పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపు పూర్తిస్థాయి పారదర్శకతతో చేపట్టినట్లు పేర్కొన్నారు. యువతలో ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించడమే తాలిం-ఏ-హునర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
Prajavartha Online Telugu News