– ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేయాలి
– క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ-పీఎన్‌డీటీ) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని.. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్‌టీ-సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ M. సునీల్ కుమార్ హాజరైన సమావేశంలో కమిటీ ఛైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ….జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరితగతిన విచారించి, తగు చర్యలు తీసుకోవాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని.. చట్టంలోని నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు వైద్య ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమం, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతమున్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు, రెన్యువల్ దరఖాస్తులను, మార్పుచేర్పుల (మోడిఫికేషన్) దరఖాస్తులను కమిటీ పరిశీలించి, చర్చించి, ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం అనుమతి ఇచ్చిన స్కానింగ్ సెంటర్లన్నీ కూడా నిబంధనల ప్రకారం పనిచేయాలని, ఆదేశించారు.
ఐ వి ఎఫ్ లో సక్సెస్ రేట్ ను దంపతులకు, తెలియజేసి పూర్తి భరోసా కల్పించాలని, ఏ విధంగా తప్పు నిరుపితమైన, తదుపరి రెన్యువల్ ఇవ్వకుండా, సెంటర్ను పూర్తిగా క్యాన్సిల్ చేయబడునని హెచ్చరించినారు.
అదేవిధంగా సరోగసీకి సంబంధించిన ఆరు దరఖాస్తులకు కమిటీ ఆమోదం తెలిపింది. కొత్తగా స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు, రెన్యువల్‌కు, మార్పులు, చేర్పులకు వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే కమిటీకి నివేదించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్చంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డా. పద్మజ, ఎన్‌హెచ్ఎం డీపీఎంవో డా. నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News