పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
పామర్రు నియోజకవర్గంలోని పలు పరిశ్రమ యూనిట్లను బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ రాయితీలతో ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, ఉపాధి అవకాశాలపై సమగ్రంగా ఆరా తీశారు.
ఈ సందర్భంగా పామర్రులో ఏర్పాటు చేసిన మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్ కు యూనిట్ వ్యవస్థాపకులు రాయసం వెంకట లక్ష్మి మనోహర్ యూనిట్ నిర్వహణ, ఉత్పత్తి విధానం, ఉపాధి అవకాశాలపై వివరించారు. పుట్టగొడుగుల సాగు విధానం, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెటింగ్ అవకాశాలపై కలెక్టర్ ప్రత్యేకంగా తెలుసుకున్నారు.
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, నిరుద్యోగ యువతకు పుట్టగొడుగుల సాగుపై శిక్షణ అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని వ్యవస్థాపకులు తెలిపారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం ఆర్కే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించిన కలెక్టర్, యూనిట్ సీఈఓ యశస్వి నుంచి యంత్రాల పనితీరు, ఉత్పత్తుల తయారీ విధానం, మార్కెటింగ్ వ్యవస్థపై వివరాలు తెలుసుకున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తూ, ఎగుమతులకు అనుగుణంగా యూనిట్‌ను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.
అదేవిధంగా పామర్రు మండలంలోని కనుమూరు గ్రామంలో యూపీవీసీ యూనిట్, రామనపూడిలో మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్, అవిరపూడిలో కోళ్ల ఫారం, పచారి సరుకుల దుకాణం సందర్శించి ఆయా యూనిట్ల వివరాలు తెలుసుకున్నారు.
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ప్రోత్సాహకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
గుడివాడ మండలం…
గుడివాడ మండలం రామన్‌పూడి గ్రామంలో ఉన్న ఆయుష్య ఫుడ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించారు.
కలెక్టర్ వెంట డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, పామర్రు ఉద్యాన శాఖాధికారి జె. కీర్తి దేవ్, కంకిపాడు ఉద్యాన శాఖాధికారి ఇ.హర్ చంద్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News