– కార్యక్రమం విజయవంతానికి పారదర్శకతకు పెద్దపీట
– క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని.. ఆపై జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్‌వోల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
త్వరలో సర్‌కు సన్నద్ధత కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ బుధవారం కంచికచర్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. బూత్‌స్థాయి అధికారి (బీఎల్‌వో)తో మాట్లాడి.. ఆ ప్రాంత ఓటర్ల జాబితా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా సర్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడటంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలసవెళ్లినవారు వంటి వారి ఓట్లను సర్ ప్రక్రియ ద్వారా తొలగించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి పారదర్శకతకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయనున్నామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కలెక్టర్ పర్యటనలో నందిగామ ఆర్‌డీవో అనిల్ కుమార్, తహసీల్దార్ వి.మానస తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News