అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి పుష్కరాలు–2027 దృష్ట్యా గోదావరి నది సహా రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం “ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్”ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్‌లో మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్యశాఖ, పర్యాటక, దేవాదాయ, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
టాస్క్ ఫోర్స్ ప్రతి పక్షం సమావేశమై గోదావరి మరియు ఇతర ప్రధాన నదుల్లో కాలుష్యానికి దారితీసే అంశాలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు పురోగతిని సమీక్షించనుంది.
పుష్కరాల సందర్భంగా భక్తులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.
Prajavartha Online Telugu News