-297 మందికి పురస్కారాలు ప్రదానం
-విద్యార్థుల భద్రత కోసం హాస్టళ్లలో సీసీ కెమెరాలు
-అన్ని హాస్టల్స్ లో జూన్ కల్లా మంచినీటి ఆర్వో ప్లాంట్ల నిర్మాణ
– సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ, ఎస్టీ విధ్యార్ధులను విద్యా పరంగా ఉన్నత శిఖరాలకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందుకే గతంలో ఎన్నడూలేని విధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల విద్యాలయాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్ధులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బందికి 2025-26 సంవత్సరానికి ఎస్ఎస్ సీ, ఇంటర్మీడియట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినందుకు సన్మాన కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంమని అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
చదువే జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనమని పేర్కొన్న మంత్రి, అభివృద్ధికి కులాలు అడ్డంకి కావని, విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాస్టళ్లలో సానిటేషన్, నాణ్యమైన ఆహారం, వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన ‘100 డేస్ యాక్షన్ ప్లాన్’ ఫలితంగా గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలకు సురక్షిత వాతావరణంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన 165 మంది రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను, 132 మంది హాస్టల్ విద్యార్థులను ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, 3.53 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు రూ. 917 కోట్లు, 2.51 లక్షల మంది ప్రీ-మెట్రిక్ విద్యార్థులకు రూ.320 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. హాస్టళ్ల మరమ్మతులు, అదనపు మరుగుదొడ్లు, కొత్త భవనాల నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం హాస్టళ్లలో సీసీ కెమెరాలు, శానిటేషన్ కోసం ప్రత్యేక అవుట్‌సోర్సింగ్ వ్యవస్థ, ఆరోగ్య పరిరక్షణ కోసం ఆధునిక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. హెడ్ ఆఫీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఐఐటీ, నీట్ కోచింగ్ కేంద్రాల సంఖ్యను 10 కు పెంచి, కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 187 మంది విద్యార్థులు వివిధ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించారని పేర్కొన్నారు. గీతం ఇన్‌స్టిట్యూట్స్ సహకారంతో 600 మంది సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఉన్నత విద్య, వసతి, ఫీజులను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు.
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్ మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కి విద్యార్ధులు, విద్యా సంబంధ కార్యక్రమాలు అంటే చాలా మక్కువని అందుకే తరచూ విద్యార్ధులకు కల్పించే సౌకర్యాలపై సమీక్ష చేస్తారన్నారు. విద్యార్ధులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను అందిపుచ్చుకుని తమ జీవితాలను అత్యుత్తంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ లో సాధించిన మార్కులు జీవితాంతం గుర్తుంటాయని వీటి ఆధారంగా తమ కెరీర్ ను మలచుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలను విద్యాపరంగా ప్రోత్సాహించాలన్నారు.
రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండు, మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో పాటు వరుసగా రూ. 20,000, రూ. 15,000, రూ. 10,000 నగదు బహుమతులు అందజేశారు. అలాగే జిల్లా స్థాయి టాపర్లను కూడా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. అత్యుత్తమ ఫలితాల సాధనలో విశేష కృషి చేసిన అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి టాపర్లు, అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు తదితరులు కలిపి మొత్తం 297 మందికి అవార్డులు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్. వి, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News