గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజం కోసం పరితపించిన నార్ల వెంకటేశ్వరరావు పేరుతో 26 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియంను శ్రీ అన్నమయ్య సేవా సంస్థ ఆధ్యాత్మిక, కళావేదికగా తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం బృందావన్ గార్డెన్స్ లోని గుంటూరు నగరపాలక సంస్థ నార్ల ఆడిటోరియంను అభివృద్ధి చేసి పూర్తి చేయుట మరియు తదుపరి నిర్వహణ చేయు కార్యక్రమాన్ని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పూర్తి చట్టబద్దత, పారదర్శకతతో నార్ల ఆడిటోరియంను అభివృద్ధి చేసి, నిర్వహణ చేయడానికి శ్రీ అన్నమయ్య సేవా సమితికి 33 ఏళ్ల కాలపరిమితితో నిర్దేశిత మార్గదర్శకాలతో కేటాయించడం జరిగిందన్నారు. నిర్మాణం పూర్తికి గడువు 2 ఏళ్లు ఉన్నప్పటికీ అంతకు ముందే పూర్తీ చేయడానికి కృషి చేయాలని కోరారు. ఏడాదికి షుమారు రూ.40 లక్షలు జిఎంసికి చెల్లించేలా, ప్రతి ఏడాది 5 శాతం పెంచేలా నిబందనలు ఉన్నాయన్నారు. ఆడిటోరియం నిర్మాణంకు అప్పట్లోనే షుమారు రూ.35 లక్షలు ఇచ్చిన మాజీ మేయర్ డాక్టర్ కొల్లి శారద దాతృత్వం వెల కట్టలేనిదని, నార్ల వెంకటేశ్వరరావు వంటి మంచి వ్యక్తీ పేరుతొ నిర్మాణం అనందంగా ఉందన్నారు. అలాగే ఇటీవల కొందరు జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అధికారుల చాంబర్ల అద్దాలు పగల కొట్టడం, అధికారులపై అసంబద్ద ఆరోపణల చేయడంను ఖండిస్తున్నామని, ప్రస్తుత కమిషనర్ నిజాయితీ, సమర్ధత తమకు తెలుసన్నారు. ఈ సమయంలో చట్టం తనపని తను చేసుకుపోతుందన్నారు. ఇటువంటి ఘటనలు అధికారుల మనో భావాలను దెబ్బతీస్తాయని, వాటిని ప్రజలు కూడా హర్షించరని స్పష్టం చేశారు.
కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ 1999లో శంఖుస్థాపన జరిగి వివిధ కారణాలతో నిర్మాణం నిలిచిన నార్ల ఆడిటోరియం నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పిపిపి పద్దతిలో అభివృద్ధికి ఆమోదం తెలిపిందన్నారు. అన్నమయ్య సేవా సమితి బిడ్ వేయడం, వారికే రావడం జరిగిందని, నిర్మాణ పనులు వేగంగా జరిగేందుకు జిఎంసి తరుపున పూర్తీ సహకారం అందిస్తామన్నారు. నార్ల ఆడిటోరియం గుంటూరు నగరానికి మంచి వేదికక నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నార్ల ఆడిటోరియం మంచి కళలకు వేదికగా నిలిచేలా అన్నమయ్య సేవా సంస్థ తీర్చిదిద్దుతుందని సంపూర్ణ విశ్వాసం తమకు ఉందన్నారు. ఎన్నో ఏళ్ళ పెండింగ్ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ 25 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని, తాము శాసన సభ్యులుగా ఎన్నికైన వెంటనే అందుకున్న తొలి అర్జీ నార్ల ఆడిటోరియం అభివృద్ధిపైనేనని, అందుకు కేంద్ర మంత్రి చొరవతో సాకారమయ్యేలా కృషి చేశామన్నారు. ఇప్పటి వరకు ఆకతాయిలకు అడ్డాగా ఉన్న అసంపూర్తి ఆడిటోరియం త్వరలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తలమానికంగా నిలిచే ఆధ్యాత్మిక, కళా వేదికగా నిలుస్తుందన్నారు. ఆడిటోరియం పేరుకే పిపిపి అని, ఆచరణలో పి4గా ఉంటుందన్నారు. ఆడిటోరియంలో ప్రతి ఆదివారం పిల్లల కోసం బాల వికాస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని కమిటిని కోరుతున్నామన్నారు.
తొలుత నార్ల ఆడిటోరియంను అభివృద్ధి చేసి పూర్తి చేయుట మరియు తదుపరి నిర్వహణ చేయు కార్యక్రమ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అనంతరం రూ.1.32 కోట్లతో అన్నమయ్య పార్క్ లో వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.
కార్యక్రమంలో ఏపి లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఏపీఐడీసి ఛైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ వడ్డెర కార్పోరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ బి.వందనాదేవి, మాజీ మేయర్లు డాక్టర్ కొల్లి శారద, కోవెలమూడి రవీంద్ర, అన్నమయ్య సేవా సమితి అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News