– బహిరంగ మార్కెట్ ధరలపై నిరంతర సమీక్షకు ఆదేశాలు
– ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమన్వయం
– ప్రాధాన్య వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు
– ధరల స్థిరీకరణ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సభ్యులు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ , వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, పప్పులు, బియ్యం, వంట నూనెలు, టమోటా, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్ హోల్‌సేల్ మార్కెట్ ధరల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఖరీఫ్-2026 సీజన్‌కు ముందస్తు సన్నద్ధత
రాబోయే ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ , పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, మనోహర్ తెలిపారు. రైతులు ప్రాధాన్యత కలిగిన వరి వంగడాలను సాగు చేసేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. డిమాండ్ తక్కువ ఉన్న వరి రకాల సాగు వల్ల ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 1010, పీఆర్-126 వంటి రకాలలో అధిక శాతం నూక వస్తుండటంతో వినియోగానికి అనుకూలంగా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని వివరించారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి అవగాహన కల్పించేలా యంత్రాంగానికి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ధరలను అదుపులో ఉంచేందుకు అవసరమైన ముందస్తు చర్యలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చామని, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్-అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, పౌర సరఫరాల కమిషనర్ కె. కన్నా బాబు, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ ఎస్. డిల్లీ రావు, ఆయిల్ ఫెడ్ ఎండీ బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News