-పర్యాటకం, యువత, క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత
-రోజంతా నియోజకవర్గంలో బిజీ బిజీగా మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపి తీరుతానని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఉదయం మంగినపూడి బీచ్ లో అభివృద్ధి పనులను పరిశీలించారు. మచిలీపట్నాని పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచ్‌ను సుందరీకరించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.
బీచ్‌కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పారిశుధ్యం, రహదారులు, తాగునీరు, లైటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా మచిలీపట్నం బీచ్ రోడ్డులో కూలిపోయిన చెట్లను స్వయంగా తొలగించారు. బీచ్‌కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
అనంతరం మచిలీపట్నం 4వ డివిజన్లోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంగణాన్ని పరిశీలించారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించే దిశగా రానున్న రోజుల్లో ఏర్పాటు చేయనున్న యుత్ క్లబ్‌పై రిటైర్డ్ డీవైఈఓ అధికారి విజయలక్ష్మి, కృష్ణాజిల్లా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ మద్దూరి ప్రసాద్‌లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
యువతను క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల వైపు ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా యువతలో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా మచిలీపట్నం 4వ డివిజన్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను పరిశీలించారు. యువత మరియు క్రీడాకారులకు మెరుగైన శిక్షణా సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు. క్రీడా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
మచిలీపట్నం సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, పర్యాటకం, యువత, క్రీడా రంగాల అభివృద్ధి ద్వారా నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News