-నగర పోలీస్ కమీషనర్ -ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. –
-అత్యాధునిక AI సాంకేతికత వినియోగంతో నేరం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సరికొత్త తరహా మోసాలు నిరంతరం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, “నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నేరం జరగకముందే ప్రజల్లో అవగాహన కల్పించడం మిన్న” అనే దూరదృష్టితో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్‌కు 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఐదు రోజుల శిక్షణ అనంతరం ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ,పి.ఎస్. శిక్షణ తీసుకున్న సిబ్బందితో సైబర్ నేరాలు, వివిధ ఆన్ లైన్ మోసాలు, ఓ.ఎల్.ఎక్స్ (OLX) యాప్ ద్వారా జరిగే మోసాల (OLX Fraud) గురించి మరియు వాటి పట్ల ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలనే విషయాలపై కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. మాట్లాడుతూ…సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, అసలు నేరమే జరగకుండా ముందే ప్రజలను అప్రమత్తం చేయడమే సురక్షితమైన మార్గం. తక్కువ మాటలతో ఎక్కువ సందేశాన్ని ఇచ్చేలా తాయారు చేసి సామాన్య ప్రజలకు, స్థానిక ప్రజలకు సులభంగాఅర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి. కే.జి.సి.సరిత ఐ.పి.ఎస్., ఇన్స్పెక్టర్లు, శిక్షణ పొందిన సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News