-క్రమశిక్షణ కలిగిన కార్యకర్త ఆధారంగా నడిచే పార్టీ బిజెపి… కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
-భీమవరంలో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల జిల్లా ‘ప్రశిక్షణ అభియాన్’
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించలేదని, దేశ ప్రయోజనాలే శ్వాసగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అద్భుత పాలనతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆశయాన్ని నిజం చేసి చూపించారని ఆయన కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ శిక్షణా తరగతులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మొదట బీజేపీ ఘనమైన చరిత్ర, కమల వికాసం, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు చేపట్టిన వివిధ సేవా, రాజకీయ కార్యక్రమాలతో కూడిన ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్ స్టాల్ ను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రదర్శన కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది.
జిల్లా ప్రశిక్షణ అభియాన్ సదస్సును ఉద్దేశించి కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ బీజేపీ అనేది కేవలం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను ఆధారంగా చేసుకుని నడిచే పార్టీ అని అన్నారు. ఎంతటి సీనియర్ నాయకుడైనప్పటికీ నిరంతర అభ్యాసం, ప్రశిక్షణ అనేది పార్టీలో అత్యంత ఆవశ్యకమని, అందువల్లే ఒక సామాన్య బూత్ స్థాయి కార్యకర్త సైతం జాతీయ స్థాయి అత్యున్నత నేతగా ఎదిగే రాజకీయ స్వేచ్ఛ ఒక్క బీజేపీలోనే సాధ్యమవుతుందని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే వివిధ కాలాంశాలలో దేశ, విదేశీ పరిణామాలు, పార్టీ సిద్ధాంతాలపై జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య వక్తల ద్వారా విస్తృత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త తాము పనిచేస్తున్న పార్టీ చరిత్రను, మూల సిద్ధాంతాలను, అంతిమ లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యవస్థీకృత శిక్షణా తరగతులు దేశంలో కేవలం బీజేపీలోనే అంతర్భాగంగా సాగుతాయని ఆయన పేర్కొన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ జాతీయ సమైక్యతే పరమావధిగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, ముందు దేశం.. తర్వాతే మనం అనే ఉన్నతమైన భావనతో ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం ఫలాలు అందాలనే అంత్యోదయ సిద్ధాంతాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు సమగ్రంగా వివరించారు. ఈ ప్రశిక్షణా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి ముళ్ళపూడి రేణుక, రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి తపన చౌదరి, రాష్ట్ర ప్రశిక్షణ సభ్యులు కోడూరి లక్ష్మీనారాయణ, ప్రశిక్షణ ఇంచార్జ్ నార్ని తాతాజీ, బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి, కబర్ది, జి. అభిలాష్, కలిదిండి వినోద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు రోజుల శిక్షణా తరగతులకు జిల్లా నలుమూలల నుండి పార్టీ ప్రతినిధులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలించి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News