-పట్టణ సుస్థిరత, వాతావరణ మార్పుల ప్రభావాలపై చర్చలు
-దేశవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్న సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (GEF), కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) సంయుక్త ఆధ్వర్యంలో “సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా” ముగింపు సదస్సు జూన్ 1, 2 తేదీలలో విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో నిర్వహించనున్నారు.
“పట్టణ సుస్థిరత మరియు వాతావరణ చర్యల పురోగతి” (Advancing Urban Sustainability and Climate Action) అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, పట్టణాభివృద్ధి నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛ భారత్ మిషన్, జీరో వేస్ట్ కార్యక్రమాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
సుమారు 100 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో పట్టణ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే చర్యలు, ఘన వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛత, పునరుత్పాదక ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
ఈ సందర్భంగా యునిడో నిర్వహిస్తున్న GeM అవార్డు – 2026 ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు వారి బృందం అందుకోనున్నారు.
జూన్ 2న భాగస్వామ్య ప్రతినిధుల కోసం గుంటూరు జిల్లా జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్, అలాగే ఇంటింటి చెత్త సేకరణకు వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల ఛార్జింగ్ కేంద్రాలను సందర్శించే ప్రత్యేక ఫీల్డ్ విజిట్ కూడా నిర్వహించనున్నారు.
ఈ సదస్సు ద్వారా పట్టణ స్థానిక సంస్థల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాల అమలు, ఉత్తమ పద్ధతుల పరస్పర మార్పిడి, స్వచ్ఛత మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల బలోపేతానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముద్రిత, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులను విజయవాడ నగరపాలక సంస్థ ఆహ్వానించింది.
Prajavartha Online Telugu News