-పదవీ విరమణ పొందిన ముగ్గురు జిల్లా అధికారులకు ఘన సన్మానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గత మే 30వ తేదీన ప్రభుత్వ సేవల నుంచి పదవీ విరమణ పొందిన ముగ్గురు జిల్లా అధికారులను సోమవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి కోసం టీమ్ కృష్ణలో భాగస్వాములై వివిధ రంగాల్లో తమ సాయశక్తులా కృషి చేసిన అధికారులు పదవీ విరమణ పొందడం ఒకవైపు బాధాకరమైన విషయమే అయినప్పటికీ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో సహజంగా వచ్చే దశ అని పేర్కొన్నారు.
పదవీ విరమణ పొందిన పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి చిన నరసింహులు, వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ పద్మావతి, ఏపీసిపిడిసిఎల్ ఎస్ఈ రవీంద్రబాబు వంటి అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను అంచనాలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించి, జిల్లా యంత్రాంగానికి విశేష సేవలందించారని కలెక్టర్ కొనియాడారు. వారి సేవలు జిల్లా పరిపాలనలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
పోస్ట్ రిటైర్మెంట్ జీవితంలో వారికి దేవుడు మంచి ఆరోగ్యం, ఆనందం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ఇన్నాళ్లు పక్కన పెట్టిన వ్యక్తిగత ఆసక్తులు, హాబీలు, పర్యటనలు వంటి వాటిని ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా అమలు చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత అభివృద్ధి ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమని, పదవీ విరమణను కొత్త అవకాశాల ప్రారంభంగా భావించి జీవితాన్ని మరింత సార్థకంగా మలుచుకోవాలని కోరారు.
అలాగే, పదవీ విరమణ పొందిన అధికారులు తమ అనుభవాన్ని యువ అధికారులతో పంచుకుంటూ వారికి మార్గదర్శకులుగా కొనసాగాలని సూచించారు. జూనియర్ ఉద్యోగులు కూడా అవసరమైనప్పుడు వారి సలహాలు, సూచనలు తీసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని, సీనియర్ అధికారుల అనుభవం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను అభినందించారు.
కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News