-పునరావృత అర్జీలకు జిల్లా అధికారులదే బాధ్యత..
-సమస్యను స్పష్టతతో శాశ్వత పరిష్కారం చూపండి..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను సమగ్ర సమాచారంతో, ఆర్జీదారుడి సంతృప్తే లక్ష్యంగా స్పష్టతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను అదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పేజీఆరఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్ర సమాచారంతో నిర్దేశించిన గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిబంధనలను పాటిస్తూ ఆర్జీదారుడు సంతృప్తే లక్ష్యంగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పునరావృతమయ్యే అర్జీలకు సంబంధిత జిల్లా స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్జీకి సంబంధించి సమస్యలను క్షుణ్నంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కారం చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు లోపు అర్జీలను పరిష్కరించాల్సిందేనని, పరిష్కారం సంబంధిత అధికారులు పరిధిలో ఉండి కూడా పెండింగ్ ఉంటే చర్యలు తప్పవన్నారు. సంతృప్తి కరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయం నేరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో అర్జీదారులు వినతులను సమర్పిస్తారని, వారి ఆకాంక్షను నెరవేర్చినప్పుడే అధికారుల పనితీరుకు అద్దంపట్టినట్లు అవుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 167 అర్జీలు అందగా.. వీటిలో
ఎంఎయూడి -36, రెవెన్యూ- 22, పంచాయతీరాజ్ – 21, పోలీస్ – 16, ఏపిఎస్‌డబ్ల్యుఆరఐఇఎస్ -7, హెల్త్ -7, పౌర సరఫరాలు-6, ఇరిగేషన్ -6, విద్య -5, డిఆర్‌డిఏ -4, టెక్నికల్ ఎడ్యుకేషన్ -3, హౌసింగ్-3, ఆర్‌డబ్ల్యుఎస్ -3, ఏపీఎసఆర్టీసీ-3 డ్వామా-2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ -2, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-2, మహిళా మరియు శిశు సంక్షేమం-2, పశుసంవర్థక శాఖ -2, సోషల్ వెల్ఫేర్-2, ఏపిసిపిడిసిల్ -2, క్రీడలు, ఆరఅండ్‌బి, ఉద్యానవనం, బ్యాంకు సంబంధిత, విభిన్న ప్రతిభావంతులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, సహకార సంఘాలు, ఎండోమెంట్స్,ఎక్సైజ్, కార్మిక శాకలకు సంబంధించి ఒక్కొక్క ఆర్జీ స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో డిఆర్‌వో ఎం లక్ష్మీనరసింహ, డిఆర్‌డిఎ పిడి ఎఎన్‌వి నాంచారరావు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ప్రత్యేక అధికారి జి. జ్వోతి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News