విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి షోరూమ్‌లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మూల వేతనంపై 10% హైక్ మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై లేపాక్షి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని లేపాక్షి కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారిని లేపాక్షి ఉద్యోగులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, లేపాక్షి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అది వేలాది కళాకారుల ప్రతిభకు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మాతృసంస్థ అని పేర్కొన్నారు. “మనము ఒక సంస్థలో పనిచేస్తున్నామంటే ఆ సంస్థను మన మాతృసంస్థగా భావించి నిజాయితీతో, అంకితభావంతో పనిచేయాలి. సంస్థ ఎదిగితే మన కుటుంబాలు ఎదుగుతాయి… మన భవిష్యత్తు కూడా బలపడుతుంది. ఉద్యోగులు సంస్థను తమ సొంత సంస్థగా భావించి పనిచేస్తే ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల శ్రమను గుర్తించి 10% హైక్ మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్న హరిప్రసాద్, ఉద్యోగుల సంక్షేమం మరియు సంస్థ అభివృద్ధి పరస్పరం అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. లేపాక్షి సంస్థను అభివృద్ధి దిశగా నడిపిస్తూ, లాభాల బాటలో నిలుపుతున్న MD విశ్వ కి, లక్ష్మీనాథ్ కి, అలాగే క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న ప్రతి లేపాక్షి ఉద్యోగికి హరిప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
“పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం లేపాక్షికి మరింత లాభాలు వచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉద్యోగుల శ్రమ, నిబద్ధత వల్లే సంస్థ పురోగమిస్తోంది. అమ్మకాలు పెరగడం ద్వారా సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుంది” అని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులను మరింత ప్రోత్సహించే దిశగా కీలక ప్రతిపాదన తీసుకువస్తామని హరిప్రసాద్ తెలిపారు. “ఎక్కువ బిజినెస్ తీసుకువచ్చి, అమ్మకాలు పెంచడంలో ముందుండే ఉద్యోగులకు ప్రత్యేకంగా ‘కట్స్’ (ఇన్సెంటివ్స్/ప్రోత్సాహకాలు) అందించే ప్రతిపాదనను తీసుకువస్తాం. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా లేపాక్షిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
ఉద్యోగులు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఆర్థిక భరోసా కలిగించిందని, హరిప్రసాద్ సహకారం తమకు ఎల్లప్పుడూ ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. లేపాక్షి అమ్మకాలను మరింత పెంచి సంస్థ పురోగతికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి సవిత కి చైర్మన్ హరిప్రసాద్ అలాగే ఉద్యోగులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News