-ఎర్ర చెరువు పునరుద్ధరణతో పెదఅవుటపల్లి గ్రామానికి జలసిరులు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యం కలిస్తే గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో చూపిస్తూ ఆదర్శంగా పెదఅవుటపల్లి “ఎర్ర చెరువు” నేడు ఒక విజయగాథగా నిలిచింది.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి గ్రామ పరిధిలోని “ఎర్ర చెరువు” ఒకప్పుడు గ్రామ ప్రజలకు, రైతులకు జీవనాధారంగా నిలిచేది. భూగర్భ జలాల పెంపు, పశువుల దాహార్తి తీర్చడం, సాగునీటి అవసరాలకు ఈ చెరువు ప్రధాన వనరుగా ఉపయోగపడేది. అయితే కాలక్రమేణా చెరువులో పూడిక పేరుకుపోవడం, పిచ్చిమొక్కలు పెరగడం, సరైన నిర్వహణ లేకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా వర్షపు నీరు వృథాగా పోవడంతో పాటు భూగర్భ జలమట్టాలు పడిపోయి రైతులు సాగునీటి సమస్యలను ఎదుర్కొన్నారు.
ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “జలధార – జలహారతి” కార్యక్రమం కింద ఎర్ర చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టబడినాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) అనుసంధానంతో, గ్రామస్థుల భాగస్వామ్యంతో చెరువును పునరుద్ధరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ముఖ్య పనులు:
చెరువులో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు.
పూడికతీత ద్వారా వచ్చిన సారవంతమైన మట్టితో చెరువు కట్టలను బలోపేతం చేశారు.
ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కాలువలను కూడా శుభ్రపరచి వర్షపు నీరు సజావుగా చెరువులోకి చేరేలా చర్యలు చేపట్టారు.
అదనపు నీరు సురక్షితంగా బయటకు వెళ్లే విధంగా కాలువలను పునరుద్ధరించారు.
ఈ పనుల ఫలితంగా గ్రామ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరిగింది. రైతులకు సాగునీటి అందుబాటు మెరుగై వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమిచ్చింది. పశువులకు నీటి కొరత తగ్గి గ్రామీణ జీవన విధానంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా స్థానిక కూలీలకు ఉపాధి అవకాశాలు కూడా లభించాయి.
పెదఅవుటపల్లి గ్రామంలోని ఎర్ర చెరువు పునరుద్ధరణ “జలధార – జలహారతి” కార్యక్రమం అసలు లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం — ఈ నాలుగు లక్ష్యాలను సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతమైంది.
వ్యవసాయానికి గట్టి భరోసా లభించడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెంపొందనుంది
కృష్ణా స్ఫూర్తి – జలధార జలహారతి”
Prajavartha Online Telugu News