– ఈ నెల 5 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సన్నద్ధత కార్యకలాపాలు
– అధికారులు, సిబ్బంది శిక్షణపై ప్రత్యేక దృష్టి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లేందుకు దోష రహిత ఓటర్ల జాబితా కీలకమని.. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
బుధవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (ఎస్ఐఆర్)-2026పై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, ఎన్నికల విభాగం అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాల్సిన సర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్‌వోల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని.. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఉంటుందని.. ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈసీఐ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ప్రతి దశలోనూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బందికి శిక్షణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) జనరేషన్, ప్రింటింగ్, ఈఎఫ్‌ల అందజేత, స్వీకరణ ఇలా ప్రతి అంశంపైనా స్పష్టతతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో కలెక్టరేట్ సమన్వయ విభాగం అధికారి అనుష్ కుమార్, ఎలక్షన్ డీటీ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News