-వైస్ ఛైర్మన్‌గా కె.వెంకట సుబ్బానాయుడు
-విజయవాడలో జరిగిన ఎన్నికలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ మెడికల్ కౌన్సెల్ చైర్మన్ గా డాక్టర్ గార్లపాటి నందకిషోర్ (ఈఎన్టీ-గుంటూరు), వైస్-చైర్మన్ గా కె. వెంకట సుబ్బా నాయుడు (ఫల్మనాలజీ-ఒంగోలు) ఎన్నికయ్యారు. విజయవాడలోని కౌన్సెల్ కార్యాలయంలో బుధవారంనాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. మెడికల్ కౌన్సెల్ లో సభ్యత్వం కలిగిన వైద్యులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న 13 మంది, అంతకు ముందు కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన ఎనిమిది మంది, ఎక్స్ అఫిషియో సభ్యులు (అధికారులు) నలుగురు ఓటింగ్ (మొత్తం 25)లో పాల్గొన్నారు. ఇందులో 16 – 9 ఓట్ల తేడాతో చైర్మన్ గా నందకిషోర్, అలాగే 14 – 10 ఓట్ల తేడాతో వైస్- చైర్మన్ గా సుబ్బానాయుడు గెలిచారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కెవియన్.చక్రధర్ బాబు వెల్లడించారు.
ముగ్గురు కార్య నిర్వాహక సభ్యుల ఎన్నిక
నూతన ఛైర్మన్ నేతృత్వంలో ముగ్గురు కార్యనిర్వాహక సభ్యుల ఎన్నిక జరిగింది. మెడికల్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, డాక్టర్ స్వర్ణ గీత 14-9 ఓట్ల తేడా( ఒక్కొక్కరు)తో గెలుపొందారని నూతన ఛైర్మన్ డాక్టర్ నoదకిషోర్ తెలిపారు.
నూతన ఛైర్మన్ పదవీ కాలం రెండేళ్లు. వైస్ ఛైర్మన్, కార్య నిర్వాహక సభ్యులు ఏడాదికి ఒకసారి మారతారు. కౌన్సిల్ పదవీ కాలం ఐదేళ్లు.
2006 తర్వాత తొలిసారిగా
కౌన్సెల్‌కు చివరిగా ఎన్నికలు 2006లో జరిగాయి. అ తరువాత కూటమి ప్రభుత్వం హయాంలో ఎన్నికలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగాయి. 2006 తరువాత ఎన్నికలు జరగనoదున కౌన్సెల్ సభ్యుల నియామకాలు జరుగుతూ వచ్చాయ. ఇదే క్రమంలో కిందటి ఏడాది నామినేట్ విధానంలో ఎంపిక చేసిన సభ్యులు కలిసి ఎన్నుకున్న ఛైర్మన్, వైస్-ఛైర్మన్ డి. శ్రీహరిబాబు, జి. సుజాతల పదవీకాలం గత ఫిబ్రవరిలో ముగిసింది.
వైద్య రంగంలో ఉత్తమ ప్రమాణాల పెంపునకు కృషిః
గార్లపాటి నందకిషోర్, సుబ్బానాయుడు
వైద్య రంగంలో ఉత్తమ ప్రమాణాల పెంపునకు కృషి చేస్తామని నూతన ఛైర్మన్ నందకిషోర్, వైస్ ఛైర్మన్ డాక్టర్ కె.వెంకట సుబ్బానాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మార్గదర్శకత్వంలో కౌన్సెల్ తరపున బాధ్యతలు సమర్ధంగా నిర్వర్తిస్తామని చెప్పారు. సహచర సభ్యుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని తెలిపారు.
15 ఏళ్ల నుంచి ఐఎంఏ తరపున కీలక బాధ్యతలు నిర్వర్తించిన నందకిషోర్
నూతన చైర్మన్ నందకిషోర్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో వివిధ హోదాల్లో 2012 నుంచి 15 ఏళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తొలుత 2012-2014లో గుంటూరు ఐఎంఏ కార్యదర్శిగా వ్యవహరించారు. ఐఎంఏ తరపునే రాష్ట్ర జాయింటు సెక్రటరీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఫామిలీ బెనిఫిట్లు స్కీమ్ సెక్రటరీ, గుంటూరు అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి, ఐఎంఏ జాతీయ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. నేషనల్ ఐఎంఏ తరఫున బెస్ట్ స్టేట్ సెక్రటరీ, బెస్ట్ స్టేట్ అధ్యక్షునిగా అవార్డులు పొందారు.
విజయవాడలోని సిద్ధార్ద మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి!
విజయవాడలోని సిద్దార్ధ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన నందకిషోర్ విశాఖపట్టణం ఆంధ్ర మెడికల్ కాలేజీల్లో ఎంఎస్ (ENT) పూర్తిచేశారు. కాటూరి మెడికల్ కాలేజీలో కన్సల్టెంటు ENT సర్జన్, హెడ్ ఆఫ్ డిపార్టుమెంటు అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. రాష్ట్ర ఈఎన్టీ వైద్యుల సంఘానికి కార్యదర్శిగా, కోశాధికారిగా వ్యవహరించిన నందకిషోర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫైర్ ఎన్వోసీల జారీ విధాన ప్రక్రియల్లో పాల్గొన్నారు. నందకిషోర్ కు టీచింగ్ రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది
శ్రీ వెంకటే శ్వర మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, ఎండీ పూర్తిచేసిన సుబ్బానాయుడు
వైస్-ఛైర్మన్ గా ఎన్నికైన కాల్వకొల్లు వెంకట సుబ్బానాయుడు తిరుపతి శ్రీ వెంకటే శ్వర్త మెడికల్ కాలేజీ (1986)లో ఎంబీబీఎస్, 1992లో ఎండీ ఫల్మనాలజీలో పూర్తిచేశారు. నెలూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పనిచేశారు.
Prajavartha Online Telugu News