-పరస్పర మార్పిడి (స్వాప్) విధానంలో సమీప బంధువుల నుంచి ‘కిడ్నీ’లు స్వీకరించేందుకు మంత్రివర్గం ఆమోదం
-ప్రస్తుతం కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే పొందే అవకాశం
-కిడ్నీలను తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు కూడా ఇవ్వొచ్చు..
-రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కిడ్నీ(మూత్ర పిండం) బాధిత రోగులకు అవయవ మార్పిడి విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. అవయవాల స్వాప్ (పరసర మార్పిడి) విధానానికి కూటమి ప్రభుత్వం చట్ట బద్ధత కల్పించింది. ఒక కటుంబంలోని దాత మరో కుటుంబంలోని గ్రహీతకు కిడ్నీని ఇచ్చి, బదులుగా వారి రోగికి అవసరమైన కిడ్నీని సదరు కుటుంబం నుంచి తీసుకునే విధానాన్ని ‘స్వాప్ డొనేషన్స్ ‘ గా వ్యవహరిస్తున్నారు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్రాంటేషన్ యాక్ట్-2011ను రాష్ట్రంలో అమలుచేసేందుకు మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జీవన్మ్రుతుల అవయదానంను ప్రోత్సహించేందుకు అనేక తీసుకుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజా నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు.
కుటుంబ సభ్యుల్లో ఒకరు ముందుకొచ్చినా కిడ్నీల మార్పిడికి కుదరడంలేదు. ప్రస్తుతం జీవించి (Live) ఉన్న కుటుంబ సభ్యుల (తల్లి, తండ్రి, కన్నబిడ్డలు) నుంచి తీసిన మూత్రపిండాలను బాధిత రోగులకు అమరుస్తున్నారు. 1995 నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని అనుసరించి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే…ఒక్కోసారి కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీలు తీసి, బాధితులకు అమర్చేందుకు చికిత్సపరంగా సాధ్యంకావడంలేదు. రోగి, దాతల(డోనార్స్) బ్లడ్ గ్రూపు మ్యాచ్ కాకపోవడం, ఒకవేళ బ్లడ్ గ్రూపు ఒకటే ఉన్నా కిడ్నీ అవసరమైన బాధితుడు, డోనార్‌కు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, ఇతర ప్రమాణాల ప్రకారం.. సాధ్యంకానప్పుడు మార్చిడి జరగడంలేదు. ఈ పరిస్థితుల్లో కిడ్నీ బాధితులకు స్వాంతన చేకూర్చేందుకు కేంద్రం హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్ యాక్ట్-2011 చట్టం ద్వారా ‘పరస్పర మార్పిడి'(స్వాప్) విధానాన్ని అమల్లోనికి తెచ్చింది. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపినందున ఆర్డినెన్స్ జారీ జరగనుంది. తదనుగుణంగా నిబంధనలు జారీ అవుతాయి.
తాజా నిర్ణయం ప్రకారం…
కిడ్నీ బాధితులు కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీలు పొందేందుకు శస్త్ర చికిత్సపరంగా(రెండు కుటుంబాల్లో) కుదరదని వైద్యులు నిర్ధారించినప్పుడు..సమీప బంధువుల నుంచి కూడా స్వీకరించొచ్చు. ఇరు కుటుంబాల్లో కిడ్నీ అవసరమైన వారు ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీలు పొందేందుకు వైద్యపరంగా సాధ్యం కానప్పుడే ‘పరస్పర మార్పిడి’ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. ఈ కేసుల్లో పరీక్షల (బ్లడ్ గ్రూపు, ఇతర పరీక్షలు) అనంతరం వైద్యులు ఇచ్చే సలహాలు, సూచనలు అనుసరించి పరస్పర అంగీకారంతో కిడ్నీలు మార్చుకోవచ్చు. ప్రస్తుత విధానంలో మాదిరిగానే సదరు కుటుంబాల వారు జోన్ల వారీగా ఉన్న మెడికల్ బోర్డులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆమోదం పొందాలి. రాష్ట్రంలో కిడ్నీల కోసం ‘జీవన్ దాన్ ట్రస్ట్ కు ‘ దరఖాస్తు చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 3,634 మంది ఉన్నారు.
తాత..అమ్మమ్మ, నాన్నమ్మల నుంచి కూడా..
బాధితులు కిడ్నీ లేదా కాలేయాన్ని తల్లిదండ్రులు, పిల్లల్ల నుంచి మాత్రమే ప్రస్తుతం పొందుతున్నారు. ఈ జాబితాలోనికి తాత, అమ్మమ్మ, నాన్నమ్మలను కూడా చేర్చారు. చిన్న వయస్సు కలిగిన పిల్లలకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుంది.
విడిగా టిష్యూ జాబితా..
చనిపోయిన వ్యక్తుల నుంచి కార్నియా, నర్వ్, టెండాన్, స్కిన్ అవసరమైన వారికి ఇస్తున్నారు. ఈ కేటగిరి ప్రస్తుతం ఆర్గాన్ డొనేషన్ జాబితాలో ఉంది. వీటిని ‘టిష్యూ’ జాబితాలోనికి చేర్చారు. సాంకేతికంగా ఈ మార్పు జరిగింది
జీవన్మ్రుతుల అవయవదానం ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. గడచిన రెండేళ్లలో మొత్తం 209 మంది 663 అవయవాలను దానం చేశారు. జీవన్మృతుల కుటుంబాలకు రూ. 10,000 చొప్పున నగదు పారితోషికాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే అవయవ దానం చేసిన మృతులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తున్నారు
Prajavartha Online Telugu News