Breaking News

ఆంగ్రూ అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకంను రైతులకు అందించిన మంత్రి అచ్చెన్నాయుడు

– రైతుల విత్తన వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడులు అందించే సరికొత్త పత్తి రకం
– ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకు మంత్రి అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకం ‘లాం బీజీ టూ-2208 (ఆదిత్య బీజీ-2)’ విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంగ్రూ ఉపకులపతి డా. పాలడుగు వెంకట సత్యనారాయణతో కలిసి మంత్రి ఈ విత్తనాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రైతులు ప్రతి సంవత్సరం ప్రైవేట్ కంపెనీల నుంచి అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చేపడుతున్న పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. పత్తి విత్తనాల్లో కల్తీ సమస్యల వల్ల రైతులు నష్టపోతున్న నేపథ్యంలో, ఆంగ్రూ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ నూతన రకం రైతులకు భరోసానిచ్చేలా ఉందన్నారు. బీటీ సాంకేతికతపై పేటెంట్ హక్కులు ముగిసిన అనంతరం సుమారు తొమ్మిదేళ్లపాటు శాస్త్రీయ పరిశోధనలు, అఖిల భారత స్థాయి పరీక్షలు నిర్వహించి ఈ రకాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జాతీయ విత్తన విడుదల కమిటీ ఆమోదంతో విడుదలైన ఈ రకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేసిన తొలి బీటీ పత్తి రకం కావడం గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా సాగుకు అనుకూలంగా ఈ రకాన్ని సిఫారసు చేసినట్లు తెలిపారు.

అధిక దిగుబడులు, మెరుగైన నాణ్యత

లాం బీజీ టూ-2208 రకం హెక్టారుకు 32 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇచ్చే సామర్థ్యం కలిగి ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హైబ్రిడ్ రకాలతో సమానమైన దిగుబడిని ఇవ్వడంతో పాటు మెరుగైన దూది నాణ్యతను కలిగి ఉందన్నారు. ఇది సూటి రకం (వేరైటీ) కావడంతో రైతులు ప్రతి సంవత్సరం కొత్త విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, తమ పొలాల్లో పండించిన పంట నుంచి విత్తనాన్ని భద్రపరచుకొని తిరిగి వినియోగించుకోవచ్చని తెలిపారు. దీంతో విత్తనాలపై అయ్యే పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు.

పురుగులు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం

ఈ రకం శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు వంటి కాయ తొలిచే పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుందని తెలిపారు. అదేవిధంగా పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక వంటి రసం పీల్చే పురుగుల ప్రభావాన్ని కూడా తగ్గించే లక్షణాలు కలిగి ఉందన్నారు. బ్యాక్టీరియల్ బ్లైట్, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, వెర్రి తెగులు వంటి ప్రధాన వ్యాధులను తట్టుకునే సామర్థ్యం ఉండటంతో రైతులు పురుగు మందులు, తెగుళ్ల నివారణ మందులపై చేసే ఖర్చును తగ్గించుకోవచ్చన్నారు.

ప్రత్యేక లక్షణాలు

– రకం : లాం బీజీ టూ -2208 (ఆదిత్య బీటీ-2)
– దిగుబడి : హెక్టారుకు 32-35 క్వింటాళ్లు
– కాయ బరువు : 5.5 నుంచి 6 గ్రాములు
– దూది పొడవు : 29.5 నుంచి 30 మి.మీ.
– దూది సున్నితత్వం : 4.3 నుంచి 4.6 మైక్రోనైర్
– దూది బలం : 33.1 గ్రాములు/టెక్స్

ఈ రకం సాధారణ సిఫారసు చేసిన దూరం కంటే సాంద్రతతో సాగు చేసినప్పుడు మరింత అధిక దిగుబడులు సాధ్యమవుతున్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తల బృందాన్ని మంత్రి అచ్చెన్నాయుడు, ఆంగ్రూ ఉపకులపతి డా. పి.వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డా. యడ్లపల్లి సతీష్, పరిశోధనల సంచాలకురాలు డా. వి. సుమతి, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. ఎన్.వి.వి.ఎస్. దుర్గాప్రసాద్, ప్రధాన పత్తి శాస్త్రవేత్తలు డా. రాఖమణి, డా. ఎన్. చాముండేశ్వరి, డా. చాపర రాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *