Breaking News

రేప‌టి నుంచి ‘యోగాంధ్ర’ రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం

-గ్రామ/ వార్డు స‌చివాల‌యాల ద్వారా కోటి మందిని భాగ‌స్వామ్యుల‌ను చేసేలా చ‌ర్య‌లు
-వైద్యారోగ్య శాఖ‌లో ప్ర‌త్యేకంగా ‘వార్ రూము’ ఏర్పాటు
-5,600 మంది యోగా మాస్ట‌ర్ల ద్వారా 2.5 లక్షల మంది ట్రైనర్లకు శిక్షణ
-ఆదివారం నాడు ‘లేపాక్షి’లోని దేవాల‌య ప్రాంగ‌ణంలో రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మం
-మొత్తం 28 జిల్లాల్లో క‌లిపి 56 ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా ప్ర‌ణాళిక‌లు
-అధికారులతో సమీక్షించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
12వ‌ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(జూన్ 21) పురస్కరించుకుని ఈనెల 7 నుంచి 21 వ‌ర‌కు ప్రత్యేక యోగా కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో కలిపి కోటి మందిని యోగాసనాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా “యోగాంధ్ర-2026” పోర్ట‌ల్‌ ద్వారా శ‌నివారం నుంచి రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్రంలోని గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా ఈ రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతాయి.
ఆయుష్ శాఖకు చెందిన అధికారులను ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ గా నియమించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5,600 యోగా మాస్టర్ల ద్వారా 2.5 లక్షల మంది ట్రైనర్లకు యోగాసనాలపై శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌బోతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి మండ‌ల స్థాయి వ‌ర‌కు జ‌రిగే ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు మూడు రోజుల‌పాటు జ‌రుగుతాయి. ఒక్కొక్క యోగా మాస్ట‌ర్ క‌నీసం 50 మంది ట్రైనర్ల కు శిక్ష‌ణ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. వీరు మిగిలివారికి యోగాసనాలపై శిక్షణ ఇస్తారు. అలాగే ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కలిపి 56 కార్యక్రమాలు జరిపే విధంగా వైద్య ఆరోగ్య శాఖ, ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 21న రాష్ట్ర స్థాయి కార్యక్రమం అమరావతిలో,నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్ట‌గా దీనికి కొనసాగింపుగా ప్రతి జిల్లా కేంద్రంలో యోగాసన కార్యక్రమాల నిర్వహణకు వీలుగా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ శుక్రవారం నిర్వహించిన సమీక్ష (వర్చువల్)లో ఉన్నతాధికారులు ఏర్పాట్లపై వివరించారు.

‘వార్ రూము’ ఏర్పాటు

ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు మంగళగిరిలోని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ‘ప్రత్యేక వార్ రూము ‘ ఏర్పాటైంది. ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు, సెకండరీ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాలకు చెందిన 30 మందితో ఈ వార్ రూము ఏర్పాటైంది.

20వ తేదీ వరకు 56 కార్యక్రమాల నిర్వహణ

యోగాసన కార్యక్రమాల నిర్వహణ అధికారికంగా ఈ నెల 7 నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయంలో జరిగే యోగాసన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ పాల్గొననున్నారు. ఇదేరోజు కృష్ణా జిల్లా మంగిన‌పూడి బీచ్, తిరుపతి-ఎస్వీ జూపార్కు, వైఎస్సార్ కడప- ఒంటిమిట్ట దేవాలయ ప్రాంగణంలో యోగాసనాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే రోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పోలీసులు, కోనసీమ జిల్లాలో రైతులతో యోగాసన (థీమాటిక్ యోగా) కార్యక్రమాలు జరుగుతాయి. మరసటిరోజు గుంటూరు జిల్లా ఉండవల్లి గూహలు, కాకినాడ-అన్నవరం, కర్నూలు-హరిత రాక్ గార్డెన్, నంద్యాల జిల్లా శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలో యోగాసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదే రోజు అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, తూర్పుగోదావరి జిల్లాలోని జైళ్లల్లో ఉన్న ఖైదీలు యోగాసనాలు చేస్తారు. ఈ విధంగా జూన్ 20వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కలిపి 56 కార్యక్రమాలు జరిగే విధంగా వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. ఇదే సమయంలో వయస్సుల వారీగా విద్యార్థులకు యోగాసనాల పై క్విజ్ వంటి పోటీలు నిర్వహిస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *